చంద్రబాబు ఘోరంగా విఫలం!
⇒ చంద్రబాబు తీరును ఎండగట్టిన రైతు సంఘాలు
⇒ దామాషా పద్ధతిలో నీటిపంపిణీకి అంగీకరించం : మాజీ మంత్రి వడ్డే
విజయవాడ(గాంధీనగర్) : కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై ఎపెక్స్ కౌన్సిల్ ఎదుట తమ వాదనలు వినిపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని పలువురు వక్తలు ఘాటుగా విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ‘ కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు- రాష్ట్రానికి జరిగే అన్యాయం’ అనే అంశంపై బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎన్. గురవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఈ నెల 21న డిల్లీలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం రాష్ట్ర రైతాంగాన్ని నిరాశపరిచిందన్నారు.
సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. దిగువనున్న నీటి పారుదల ప్రాజెక్టుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని విభజన చట్టంలో స్పష్టం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు విభజన చట్టానికి విరుద్దమన్నారు. వీటికి ఏ ఒక్క అనుమతి లేదన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీన్ని సమర్థంగా, బలంగా తిప్పకొట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. సీఎం చంద్రబాబు ఏ ఒక్క విషయంలోనూ రైతుసంఘాల ప్రతినిధులు, నీటిపారుదల రంగ నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకటయ్య మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అల్మట్టి ఎత్తు పెంచుతుంటే గుడ్లప్పగించి చూశారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి కారణంగానే కృష్ణా డెల్టా సంక్షోభంలో చిక్కుకుందని, ఇకనైనా కళ్లు తెరిచి డెల్టా ప్రయోజనాలు కాపాడాలని వైఎస్సార్‌సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (సీపీఎం) ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు, రైతుసంఘం (సీపీఐ) ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ.. మొట్టమొదటి సారిగా కృష్ణాడెల్టాకు కాలువల ద్వారా నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మిగులు జలాలపై చివరి రాష్ట్రమైన ఏపీ వాడుకునే అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు. ఈ సమవేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు నాగేంద్రనాథ్, రిటైర్డ్ డెప్యూటీ సీఈ కోనేరు రాజేంద్రప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.