రాష్ట్రాన్ని విడదీయమని కోరిందే చంద్రబాబు: బొత్స
ఢిల్లీ: రాష్ట్రాన్ని విడదీయమని కోరిందే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టారో బాబు చెప్పాలన్నారు. విభజనపై మొదటిగా లేఖఇచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు తెలంగాణకు అనుకూలంగా ఆయన లేఖలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్తో ఆయన దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విడదీయమని చంద్రబాబు లేఖ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 2009లో తీసుకున్న నిర్ణయం విషయంలో కొందరు వెనక్కు వెళ్లారని చెప్పారు. ద్వంద వైఖరులు ఉన్నాయని తెలిపారు.
రక్షణ మంత్రి ఆంటోనీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల మనోభావాలను నేరుగా తెలుసుకోవాలని కమిటీలో సభ్యుడైన దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పర్యటిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే తేదీ ఏమీ చెప్పలేదన్నారు. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్లు త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.
సీమాంధ్ర నేతలు రోజుకోరకంగా మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. ఒకరిద్దరు రాజీనామా చేసినంత మాత్రాన ఫలితం ఉండదని, అందరూ కలిసి రాజీనామా చేస్తేనే అధిష్టానం వెనక్కు తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం వినిపించడంలో తప్పులేదన్నారు. మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యల్లో కూడా తప్పు లేదన్నారు. విభజన సమస్యలపై ఆలోచించాలని చెప్పారు. విలేకరులు తెలంగాణ ప్రక్రియ విషయం ప్రస్తావించగా అధిష్టానాన్నే అడగండని అన్నారు. సీమాంధ్రలో ఆందోళన వల్ల ఆర్టీసి నష్టపోతోందన్నారు.