కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జెండా వందనం చేసే మంత్రుల జాబితాను సర్కార్ మంగళవారం విడుదల చేసింది. అయితే కేఈ కృష్ణమూర్తికి జెండా వందనం చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అన్ని జిల్లాల్లోనూ ఇన్‌ఛార్జ్ మంత్రులే జెండా ఎగురవేస్తారంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కేఈ సొంత జిల్లా కర్నూలులో కాల్వ శ్రీనివాసులు జెండా వందనం చేయనున్నారు.
ఇప్పటికే కేఈకి అన్ని అధికారాల్లోనూ చంద్రబాబు కోత పెట్టిన విషయం తెలిసిందే. కాగా జెండా ఎగురవేసే అవకాశాన్ని కేఈ కృష్ణమూర్తికి ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎంకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కేఈ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఏపీ కేబినెట్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయనకు అవమానాలు ఎదురు అవుతూనే ఉన్నాయి. కాగా ఇటీవల జరిగిన జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల నియామకంలో కేఈకి చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్‌చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్‌లో అందరికంటే సీనియర్ అయినా కేఈ కృష్ణమూర్తిని చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం.