కలం కబుర్లు: ఉలిక్కిపడ్డ బాబు..! | Chandrababu Naidu afraid about that Nagarjuna university | Sakshi
Sakshi News home page

కలం కబుర్లు: ఉలిక్కిపడ్డ బాబు..!

Published Sun, Nov 23 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

కలం కబుర్లు: ఉలిక్కిపడ్డ బాబు..!

కలం కబుర్లు: ఉలిక్కిపడ్డ బాబు..!

నాగార్జున విశ్వవిద్యాలయం పేరెత్తగానే  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ ఉలిక్కిపడుతున్నారట! అక్కడ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుపుదామన్న ప్రతిపాదన వచ్చింది. సభాపతి కోడెల శివప్రసాదరావు అక్కడకు వెళ్లి పరిశీలించి కూడా వచ్చారు. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన పలువురు ఆ యూనివర్సిటీకి వెళ్లిన కొద్ది రోజుల తర్వాతే రాజకీయంగా నష్టపోయారన్నది ప్రచారంలో ఉంది. ఈ ప్రచారం వాడుకలోకి వచ్చాక స్నాతకోత్సవాలకు కూడా గవర్నర్లు రావడం లేదని ఇక్కడి ఉద్యోగులు సైతం అంటుంటారు. పక్కనే కృష్ణా విశ్వవిద్యాలయానికి హాజరవుతున్న గవర్నర్లు నాగార్జున వర్సిటీకి మాత్రం రావడం లేదు. దీన్ని బాగా నమ్ముతున్న కారణంగానే చంద్రబాబు సైతం ఆ వర్సిటీ పేరెత్తగానే కంగారు పడుతున్నారని అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి గుంటూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఆర్భాటంగా కార్యక్రమం నిర్వహించారు.
 
 ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు కోసం అధికారులు యూనివర్సిటీ క్యాంపస్‌లోని అతిథి గృహాన్ని తీర్చిదిద్దారు. అయితే జ్యోతిష్యుల సూచనల మేరకు ఆయన ఆ అతిథి గృహంలో అడుగుపెట్టలేదు. ప్రమాణ స్వీకారం చేసే ప్రదేశానికి పక్కనే హుటాహుటిన మరో విశ్రాంతి గదిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తర్వాత సెప్టెంబర్ 5న జరిగిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఈ యూనివర్సిటీలోనే జరపాలని నిర్ణయించారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యే తరుణంలో ఆఖరు నిమిషంలో వేదికను గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు మార్చారు. ఇప్పుడు మూడోసారి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను యూనివర్సిటీలోని ఆడిటోరియంలోనే జరపాలని భావించి సభాపతి కోడెల ఉత్సాహం ప్రదర్శిస్తే.. ఆ ప్రతిపాదనను నీరుగార్చుతూ మరోసారి చూద్దామని బాబు చెప్పారట!
 
 మతలబేంటబ్బా...!
 కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారనగానే మిత్రపక్షమైన టీడీపీలో అప్పట్లో పెద్ద కలకలమే రేగింది. మోదీ తన కేబినెట్‌లో తొలిసారి టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పిం చగా.. విస్తరణలో రెండో బెర్త్ ఇస్తున్నట్టు సమాచారం రాగానే పార్టీ ఎంపీల్లో చర్చ మొదలైంది. ఎంపీల్లో సీనియర్లలో బీసీలే ఉన్నందున వారిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా చంద్రబాబు తన సన్నిహితుడైన సుజనా చౌదరి పేరును ప్రధానమంత్రికి సూచించారు. మిత్రపక్షమైన టీడీపీకి ఒక బెర్త్ ఖాయం చేసిన మోదీ ముందుగానే ఒక శాఖను ఎంపిక చేసుకున్నారు. అయితే చంద్రబాబు తన సన్నిహితుడైన సుజనా చౌదరి పేరును సూచించడంతో ఆ వెంటనే శాఖను కూడా మార్చారట. కొందరు టీడీపీ నేతలే రాత్రికి రాత్రి సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణల చిట్టాను కేంద్రానికి చేరవేశారు. అప్పటికే కేంద్రం వద్ద ఉన్న సమాచారానికి టీడీపీ నాయకులు పంపిన చిట్టా చేరడంతో సుజనాకు ఇవ్వాలనుకున్న శాఖను మార్చి అంతగా ప్రాధాన్యం లేని  శాస్త్ర సాంకేతిక శాఖ (సహాయ మంత్రి)ను మోదీ కట్టబెట్టారని పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది!!
 
 హమ్మయ్య.. బదిలీ అయ్యాడా..
‘ఆ అధికారి బదిలీ అయ్యాడా.. హమ్మయ్య!’.. ఇదేదో ప్రభుత్వ ఆఫీసులో ఏదో పని కోసం వెళ్లి విసిగి వేసారిన సగటు మనిషి నిట్టూ ర్పుకాదు.. తెలంగాణలో సాక్షాత్తు ఓ రాష్ట్ర మంత్రి నిస్సహాయత. ఏవో పనుల కోసం తన దగ్గరికి వచ్చే ఎమ్మెల్యేలకు సాయం చేసేందుకు సదరు మంత్రివర్యులు ఓ డీఎస్పీకి ఫోన్ చేస్తే... అతను పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకటికి రెండుసార్లు చెప్పినా వినలేదు.. పనికాలేదని తెలిసి మంత్రిగారు చెడా మడా తిట్టినా కదలిక లేదు. ఇక చేసేది లేక తన ఓఎస్డీని పిలిపించుకుని ‘ఆ డీఎస్పీ మాట వినడం లేదు, ఏం చేద్దా’మంటే... ‘ఏం చేయడమెందుకు సార్.. బదిలీ జాబితాలో ఉన్నాడు. వారం రోజులు ఆగితే చాలు’ అని ఓఎస్డీ సలహా ఇచ్చాడు. ఓ వారం అయ్యాక డీఎస్పీ బదిలీ అయ్యాడు. ఈ సంగతి తెలిసిన మంత్రివర్యులు.. ‘హమ్మయ్య.. ఇప్పుడు వచ్చిన అధికారి అయినా మాట వింటాడంటావా?..’ అని నిట్టూర్చారు. రాష్ట్రంలో ఓ శాఖను పర్యవేక్షించే మంత్రి మాటకే అధికారుల వద్ద విలువ లేకపోతే మాలాంటి వారి పరిస్థితి ఏమిటో.. అంటూ ఓ శాసనసభ్యుడు అసలు విషయం చెప్పాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement