
ఉద్యమానికి భయపడే బాబు యాత్ర వాయిదా: శోభా నాగిరెడ్డి
నయవంచనకు మారుపేరైన చంద్రబాబుకు ఎవరినైనా తాకట్టు పెట్టే అలవాటు ఉందని, ఇప్పుడు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. దీక్షా ప్రాంగణం వద్ద శోభా నాగిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం చూసి భయపడే చంద్రబాబు తన ఆత్మ గౌరవ యాత్ర వాయిదా వేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పేరు వింటేనే చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని చెప్పారు.
రాష్ట్రం ఎడారిగా మారుతుంటే నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్న చంద్రబాబు తెలుగు జాతికి చేస్తున్న ద్రోహంతో చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్‌ను నిత్యం తిట్టడమే పనిగా పెట్టుకున్న బాబు, అతని బృందం చంచల్‌గూడ జైలు వద్ద కాపలా కాస్తే మంచిదని సూచించారు. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న జగన్‌పై విమర్శలు చేయడం సూర్యుడిపై ఉమ్మేయడమేనన్నారు. సోనియా డైరక్షన్‌లోనే సీఎం కిరణ్, చంద్రబాబు యాక్షన్ చేస్తున్నారని, అందులో భాగంగానే అప్పుడప్పుడు తమ పాత్రలు కూడా మార్చుకుంటున్నారని దుయ్యబట్టారు.