
పత్తిపాటి పుల్లారావు
హైదరాబాద్: రైతుల రుణమాఫీపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసిన తరువాత పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించి సీఎంతో గంటన్నర సేపు సమావేశమైనట్లు తెలిపారు. డ్వాక్రా మహిళల రుణాలపై కూడా సీఎం రేపు ప్రకటన చేస్తారని చెప్పారు.
50 వేల రూపాయల లోపు రుణాలు వెంటనే రద్దు చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. 43 లక్షల మంది రైతులు రుణమాఫీ కిందకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉన్న మంత్రులు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం సమావేశమవుతారన్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్మీట్లో సీఎం ఒక ప్రకటిస్తారని చెప్పారు. ఎంత లోపు రుణాలు మాఫీ చేసేది, రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయం సీఎం చంద్రబాబు వివరంగా చెబుతారని మంత్రి పత్తిపాటి తెలిపారు.
ఏపీ కొత్త రాజధానికి భూములు ఇచ్చే రైతులతో సీఎం మరోసారి సమావేశమవుతారని ఆయన చెప్పారు.
**