మళ్లీ బిగుస్తున్న మైక్రో ఉచ్చు
సాక్షి, కాకినాడ :‘ఇంకేముంది.. ‘బాబు’ వచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలన్నీ ‘మాఫీ’ చేస్తాడు. అడక్కుండానే కొత్త రుణాలు మంజూరవుతాయి’ అనుకున్న డ్వాక్రా మహిళల ఆశలు అడియాసలయ్యాయి. రుణవాయిదాలను క్రమం తప్పక చెల్లిస్తున్న వారు చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నమ్మి, చెల్లింపును మానేశారు. ఇప్పుడు బాబు మాట తప్పి, ఢోకా ఇవ్వడంతో అసలుకే ఎసరు వచ్చినట్టు.. వడ్డీల భారం తడిసిమోపెడవుతోంది. దీంతో దాన్నుంచి విముక్తులు కావడానికి, కుటుంబ అవసరాలకు హెచ్చు వడ్డీలకు ప్రైవేట్ అప్పులు చేయక ఆడపడుచులకు తప్పడం లేదు. ఇదే అదనుగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ విజృంభిస్తున్నాయి. వారిని తమ ఉచ్చులో బిగిస్తు న్నాయి.
అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలి సంతకం చేశారు. తర్వాత రుణ మాఫీ కాదు, సంఘానికి రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తానంటూ మాట మార్చారు. కనీసం ఆ గ్రాంటయినా వెంటనే విడుదలైతే మిగిలిన అప్పయినా అప్పోసప్పో చేసి చెల్లించవచ్చని మహిళలు ఆశించారు. నెలలు గడుస్తున్నా మ్యాచింగ్ గ్రాంట్ అందనే లేదు. దీంతో నెలల తరబడి రుణ బకాయిలు చెల్లించక పోవడంతో మహిళలు వడ్డీ రాయితీలు పూర్తిగా కోల్పోయారు. రుణబకాయిలు వడ్డీతో సహా చెల్లిస్తే తప్పకొత్త రుణాలు మంజూరు చేసే ప్రసక్తే లేదని బ్యాంకర్లు తెగేసి చెప్పారు. ఇప్పుడు 14 శాతం వడ్డీతో బకాయి మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్యాంకులకు రికవరీ కరువు..
2014-15లో జిల్లాలో రూ.1273 కోట్ల డ్వాక్రా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 40,171 సంఘాలు అర్హత పొందాయి. రుణమాఫీ మతలబు పుణ్యమా అని.. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై అర్ధ సంవత్సరం ముగియవస్తున్నా కనీసం ఐదు శాతం కూడా కొత్త రుణాలు మంజూరు చేయలేని దుస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇప్పటి వరకు 2088 సంఘాలకు రూ.69 కోట్ల మేర రుణాలు ఇవ్వగలిగారు. గతేడాది ఇదే సమయానికి రూ.450 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశారు. గతేడాది మొత్తం రూ.963 కోట్ల రుణాలు మంజూరు చేయగా, ప్రతి నెలా 97 శాతం తక్కువ కాకుండా రుణవాయిదాల చెల్లింపులు జరిగేవి. కానీ ఈ ఏడాది జనవరి నుంచి చెల్లింపు ఏ నెలలోనూ 10 శాతం దాటలేదు. ప్రస్తుతం అతికష్టమ్మీద 20 శాతానికి చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి రూ.270 కోట్ల వరకు రికవరీ ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం రూ.1.80 కోట్లు మాత్రమే రికవరీ జరిగింది. గతేడాది ఆగస్టులో రూ.76 కోట్ల రికవరీ ఉంటే ఈ ఏడాది ఆగస్టులో కేవలం రూ.18 లక్షలకు మించి లేదు.
మళ్లీ చక్రవడ్డీల బోనులోకి..
బ్యాంకర్ల పరిస్థితి ఇలా ఉంటే 14 శాతం వడ్డీతో ఆరేడు నెలల బకాయిలు చెల్లించలేక డ్వాక్రా మహిళలు బ్యాంకర్ల ఛాయలకు వెళ్లడం లేదు. చేసిన అప్పులు తీరక, కొత్త అప్పులు పుట్టక అవస్థలు పడుతున్నారు. అప్పుల ఊబిలో రోజురోజుకూ కూరుకు పోతున్నారు. మరొక పక్క దసరా, దీపావళి పండుగలొస్తుండడంతో కుటుంబ అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అందినకాడికి అప్పులు చేస్తున్నారు. ఇదే అదనుగా.. ఇన్నాళ్లూ తోక ముడిచిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ వీరిపై అప్పుల వల విసురు తున్నాయి. సిబ్బందిని ఇంటింటికీ పంపి, వారికెంత రుణం కావాలంటే అంత రుణం మంజూరు చేస్తున్నాయి. రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు ఇస్తూ తమ చక్రవడ్డీల బంధంలో ఇరుక్కునేలా చేస్తున్నాయి. 14 శాతం వడ్డీతో రుణబ కాయిలు చెల్లించలేక కొట్టుమిట్టాడుతున్న డ్వాక్రా మహిళలు ఇప్పుడు మైక్రో ఉచ్చులో పడుతున్నారు. చంద్రబాబు మాటను నమ్మిన పాపానికి ఆడపడుచులు ఇలా ఇంకా ఇంకా అప్పుల ఊబిలో దిగబడాల్సి వస్తోందని, చివరికి ఇది గతంలోలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థల వసూళ్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే విషాదానికి దారి తీయవచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిణామమే సంభవిస్తే.. ఆ పాపం మాట తప్పిన ముఖ్యమంత్రిదేనంటున్నారు.