
ఎస్సార్బీసీపై నిర్మాణానికి నోచుకోని వంతెన
జూపాడుబంగ్లా: ప్రాజెక్టుల వద్ద నిద్రించైనా పెండింగ్ పనులు పూర్తి చేయిస్తానని సీఎం చంద్రబాబునాయుడు 2015 మే 12న భానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ వద్ద రైతాంగానికి హామీనిచ్చారు. అదేవిధంగా 2015 మార్చి 5న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పరిశీలించినభారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం 100 రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయిస్తామని, 2015 జూన్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయిస్తానని వాగ్దానం చేశారు. సీఎం, మంత్రి.. తప్పుడు హామీలతో రైతులను మభ్యపెట్టేందుకు యత్నించారే తప్ప, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేయలేకపోయారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ పనులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం...
పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటరు నిర్మాణం పనులు 2006 డిసెంబర్‌లో రూ.201.347కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యాయి. ఆరేళ్ల క్రితం 85 శాతం పనులు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 15శాతం పనులను పూర్తిచేయించటంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీనికితోడు పనుల నిర్మాణం సమయంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో డిజైన్‌లో లోపం ఉన్నట్లు ఈఎన్‌సీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా నాసిరకంగా పనులు చేయటం వల్ల నూతన హెడ్‌రెగ్యులేటరు అప్‌స్టీం సేఫ్టీవాల్‌గోడలు పగుళ్లు ఇచ్చాయి.
పూర్తికాని పనులు, వంతెనలు
ఎస్సారెమ్సీ(శ్రీశైలం రిజర్వాయర్ కుడి ప్రధాన కాల్వ)ని బానకచర్ల వద్ద విస్తరించాల్సి ఉంది. అలాగే కాల్వలోని పూడికను తొలగించాల్సి ఉంది. 0 నుంచి 9కిలోమీటర్ల మేర ఎస్సారెమ్సీ ఎడమగట్టును పటిష్టంచేసి స్టాండర్డు బ్యాంకును నిర్మించాల్సి ఉంది. కుడిగట్టు వెంట 16.325 కిలోమీటర్ల మేర బీటీ రహదారిని నిర్మించాల్సి ఉంది. కాల్వ వెంట వంతెనల నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల నివాస గృహాలు, కంట్రోల్‌రూంను నిర్మించాల్సి ఉండగా.. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తికావొస్తున్నా నేటికీ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.
పూర్తికాని ఎస్సార్బీసీ
పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేసే 44వేల క్యూసెక్కుల నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ, కేసీ ఎస్కేప్ కాల్వలు 11వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీకి 22వేల క్యూసెక్కులు ఇవ్వాల్సి ఉంది. ఎస్సార్బీసీ విస్తరణ పనులు నత్తను తలపిస్తుండటంతో 22వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్సార్బీసీకి 6వేల క్యూసెక్కులను మించి సరఫరా చేయలేకపోతున్నారు.
ఆగస్టు 19 వరకు పనులుపొడిగించారు
పోతిరెడ్డిపాడు పనులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. వాటిని పూర్తిచేసేందుకు ఈ ఏడాది ఆగస్టు 19 వరకు గడువును పొడిగించాం. త్వరలో పనులు పూర్తి చేయిస్తాయిం. దిగువ నున్న కాల్వలు పూరైతేనే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకొనే అవకాశం ఉంటుంది. – మనోహర్‌రాజు, ఈఈ, పోతిరెడ్డిపాడు
మొరాయిస్తున్న గేట్లు
పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల గేట్లు తుప్పుపట్టి ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేం అన్నట్లుగా మారాయి. కొత్త హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న పదిగేట్లలో ఆరింటికి ఉన్న రబ్బర్‌షీల్స్ ఊడిపోవటంతో ప్రారంభానికి ముందే లీకేజీ అవుతున్నాయి. అలాగే 3వగేటు సక్రమంగా పనిచేయట్లేదు. పాత హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న నాలుగు గేట్లలో కేవలం 2, 3 మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయి. ఒకటోగేటు స్టాండ్‌భైగా ఉండగా 4వగేటు సక్రమంగా పనిచేయట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment