
ఎన్నికల్లో ఓడినా.. చంద్రబాబు తీరు మారలేదు: లగడపాటి రాజగోపాల్
2009 ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓటమి చవిచూసిన తర్వాత కూడా చంద్రబాబు తీరు మారలేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ఓ బహిరంగ లేఖ రాశారు.
కేసీఆర్ దీక్ష సమయంలో అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెడితే చంద్రబాబు మద్దతిస్తానన్నారని, గత ఏడాది కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని కేసీఆరే స్వయంగా చెప్పినా కూడా.. అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో బస్సుయాత్ర చేయడం సరికాదని ఆయన టీడీపీ అధ్యక్షుడికి సూచించారు. చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని వంచించాలని చూస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు.