
చంద్రబాబు బంపర్ ఆఫర్!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారు. తన ఆస్తుల మొత్తం విలువ రూ. 42.06 లక్షలని ఆయన తెలిపారు. తన భార్య భువనేశ్వరి పేరిట రూ. 33.03 కోట్ల విలువైన ఆస్తులున్నాయన్నారు. తన కుమారు లోకేష్ ఆస్తుల విలువ రూ. 4.92 కోట్లు, కోడలు బ్రహ్మణి ఆస్తులు విలువ 3.30 కోట్లు అని వెల్లడించారు.. తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా తనకింకా ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే వాటా ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.
తాము స్థాపించిన హెరిటేజ్ కంపెనీని పూర్తి పారదర్శకంగా పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 1992లో హెరిటేజ్ కంపెనీ ప్రారంభించామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే 14.96 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. రాజకీయ నాయకుడిగా సమాజానికి జవాబుదారి కాబట్టి స్వచ్ఛందంగా ఆస్తులు ప్రకటించినట్టు తెలిపారు. తనలా ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందన్నారు. తనకు డబ్బుల మీద వ్యామోహం లేదన్నారు.
అయితే టీడీపీ నాయకులు అందరూ ఆస్తులు ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఆస్తుల ప్రకటించాలని వారిపై ఒత్తిడి పెంచాబోమని చెప్పారు. కాగా, తనకు రూ. 38 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని 2012లో చంద్రబాబు ప్రకటించారు. 2011లోనూ ఇదే మొత్తం చెప్పారు. సింగపూర్లో తనకు ఏవిధమైన ఆస్తులు లేవని మరీ మరీ చెప్పారు.