పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
వచ్చే ఎన్నికలకు ముందే పోలవరం పూర్తి
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి
* పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను సంద ర్శించిన సీఎం
ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి తొలిదశగా ఆగస్టు 15 నాటికి కృష్ణాడెల్టాకు గోదావరి నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఎన్నికలకు ముందే పూర్తిచేసి తీరతామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.1,300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పనుల తీరును గురువారం ఆయన పరిశీలించారు.
రాజమండ్రి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం పోలవరం ప్రాజెక్టు, కుడికాలువ పనుల్ని ఏరియల్‌సర్వే జరిపారు. పట్టిసీమ పనుల తీరుపై అధికారుల్ని ఆరాతీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ చేసే సందర్భంలో రైతు నుంచి భూమి తీసుకున్న మరుసటిరోజునే నష్టపరిహారమందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పనుల్ని తన ఇంటినుంచి పర్యవేక్షించేందుకు ప్రాజెక్టు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానన్నారు.
30 నాటికి పుష్కర పనులు: సీఎం
రాజమండ్రి: గోదావరి పుష్కరాల పనులు ఈ నెల 30నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాల్సిందేనని, కాకుంటే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. గురువారం రాజమండ్రిలో సమీక్షించారు.
బస్సులోనే సీఎం బస
సాక్షి, విజయవాడ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని గురువారం రాత్రి విజయవాడ వచ్చిన సీఎం చంద్రబాబు బస్సులోనే బస చేశారు.గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కార్యాలయం కారిడార్‌లో నిలిపిన బస్సులోకి వెళ్లారు. శుక్రవారం ఉదయం సీఎం చిత్తూరు వెళ్తారు.
ఆ పావుగంట ఏం జరిగింది..
‘పట్టిసీమ’ పనుల్ని పరిశీలించాక సీఎం చంద్రబాబు తిరుగుప్రయాణమవగా.. పోలవరం స్టేట్‌బ్యాంక్ సమీపంలో ఒక్కసారిగా కాన్వాయ్ నిలిచిపోయింది. ఎందుకాగిందో తెలియక అధికారులు, పోలీస్ యంత్రాంగం ఆందోళనకు గురయ్యారు. భద్రతా సిబ్బంది వాహనాలనుంచి దిగి సీఎం చుట్టూ రక్షణగా నిలిచారు. చంద్రబాబుకు అత్యవసర ఫోన్ వచ్చిందని, అందుకే కాన్వాయ్ ఆగిందని తెలుసుకుని అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 15 నిమిషాలు కాన్వాయ్ ఆపి సీఎం ఫోన్‌లో మాట్లాడటం చర్చనీయాంశమైంది. ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి హైదరాబాద్ నుంచి ముఖ్యమైన ఫోన్ వచ్చి ఉంటుందని నేతలు గుసగుసలాడుకోవటం కనిపించింది. మరోవైపు హెలిపాడ్ వద్ద సీఎం ప్రత్యేక వాహనంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో అరగంటపాటు మంతనాలు సాగించారు.