
చంద్రబాబుది అవకాశవాదం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆయన అవకాశవాదానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు దుయ్యబట్టారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఆయన అవకాశవాదానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు దుయ్యబట్టారు. 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు నడిపిస్తూనే, మరోవైపు బీజేపీతో పొత్తు ప్రయత్నాలు నెరపడం చూస్తే ఆయన నైజం ఏంటో తేటతెల్లమవుతుందని పేర్కొన్నారు. బాబు తన స్వలాభం, అధికారం కోసం ఎవరితోనైనా ఎలాంటి ఒప్పందాలైనా చేసుకోవడానికి వెనకాడరని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి కంటే చంద్రబాబు మనసే ఎక్కువ అనిశ్చితిలో ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాడి మాట్లాడారు.
బాబు ఢిల్లీ పర్యటన అసలు రహస్యం అధికారం కోసం ఆరాటం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పోరాటమని వ్యాఖ్యానించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నాయకులను వెంట పెట్టుకెళ్లిన చంద్రబాబు విధానమేంటని సూటిగా ప్రశ్నించారు. బాబుది సమైక్య వాదమా, విభజన వాదమా, లేక పలాయన వాదమా అంటూ ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణ ప్రాంతాల నాయకులు సమైక్యానికి అంగీకరించారా? లేదా సీమాంధ్ర నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపారా? రెండు ప్రాంత నాయకులను తీసుకెళ్లి ఢిల్లీలో ఏం చెప్పారు?’’ అని బాబును ప్రశ్నించారు.
అపాయింట్‌మెంట్ లేఖతో
అసలు రహస్యం బట్టబయలు
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు చెప్పేందుకు వెళుతున్నానని చెప్పిన చంద్రబాబు అసలు రహస్యం.. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరుతూ రాసిన లేఖతోనే బట్టబయలైందని దాడి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతికి ఇచ్చిన లేఖలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఒక్క ముక్కయినా ఉందా అని ప్రశ్నించారు. బాబుకు నిజాలు చెప్పడం చేతకాదని, అబద్ధాలు చెప్పడానికి దేనికీ వెనకాడరని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదంటూ, దాని గురించి రాష్ట్రపతిని ఇతర రాజకీయ పార్టీలను కోరడం ఆయన దివాలాకోరుతనాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. ‘‘ జగన్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వెలువడే ముందు కోర్టులను ప్రభావితం చేసే విధంగా చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి, జగన్‌కు బెయిల్ మంజూరు చేయకుండా ప్రధానికి చెప్పండని కోరడం ఎంత వరకు సబబు? కోర్టులను ప్రభావితం చేయడమే కాక, ధిక్కరణకు పాల్పడుతున్నారు’’ అని ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు కాంగ్రెస్ వారిని కలవలేదంటారు. కానీ ఆయన పగలు కలవరు. చీకట్లో సమావేశమవుతారు! బాబు పక్కనున్న ఎంపీలు, కార్పొరేట్ సెక్టార్‌కు చెందిన వ్యక్తులు కాంగ్రెస్ మంత్రులతో ఏవిధమైన సయోధ్య నడుపుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియదనుకుంటున్నారా?’’ అని మండిపడ్డారు. దివంగత ఎన్టీరామారావు కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై టీడీపీని ఏర్పాటు చేస్తే ఆయనను వెన్నుపోటు పొడిచిన బాబు.. ఎన్టీఆర్ ఆశయాన్ని కూడా తుంగలో తొక్కి, కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీని పిల్ల కాంగ్రెస్‌గా మార్చారని నిప్పులు చెరిగారు.
చేతనైతే ఎదురుగా ఢీకొను...
‘‘ఏ రాజకీయ నాయకుడైనా తన ప్రత్యర్థి రంగంలో ఉంటే ఢీ కొనడం ఇష్టపడాలి. అంతేకాని జగన్ బయటకు వస్తే ఆయన ప్రభంజనానికి తట్టుకోలేనని, మటాష్ అవుతాన నే భయంతో ప్రత్యర్థిని నిరోధించడానికి కుట్రలు, కుతంత్రాలు చేయడం హుందాతనం అనిపించుకోదు’’ అని చంద్రబాబుకు దాడి హితవు పలికారు. జగన్ బయటకు రావాలని, వచ్చాక పోరాటం చేస్తానని బాబు చెబితే అదొక ధర్మ యుద్ధమవుతుందన్నారు. అంతేకాని జగన్ బయటకొస్తే మీరు, మేము బతికి బట్టకట్టలేమని కాంగ్రెస్‌కు నివేదికలివ్వడం సిగ్గుచేటని విమర్శించారు.
ఇదేనా టీడీపీ విధానం: నిన్న, మొన్నటి వరకు బీజేపీపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. మళ్లీ అదే పార్టీతో స్నేహహస్తం చాచడం ఆయన అవకాశవాదానికి నిదర్శమని వీరభద్రరావు దుయ్యబట్టారు. ‘‘2004 ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.
అలాంటి వ్యక్తే ప్లేట్ ఫిరాయించి బీజేపీకి స్నేహహస్తం అందిస్తున్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా చేయడం కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఉపయోగించుకుంటున్నారు. తన మీద ఉన్న అవినీతి కేసులపై సీబీఐ విచారణ వేయకుండా ఎప్పటికప్పుడు ఆ పార్టీతో కలిసి పనిచేశారు. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని మళ్లీ అటు కాలుమోపుతున్నారు. 2014 దాకా కాంగ్రెస్‌తో, ఆ తర్వాత బీజేపీతో ఇదేనా టీడీపీ విధానం’’ అని దాడి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై బీజేపీ తనకు తానుగా 1998లో ఒక చార్జిషీట్ వేసింది. బాబు వంద తప్పులు చేశారని, కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే దర్యాప్తు చేయిస్తామని పేర్కొంది. 1999లోకి ఎన్డీయే అధికారంలో వచ్చాక దీనిపై బీజేపీ ఏవిధమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బాబు మద్దతిచ్చారు. ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే తన హయాంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఎక్కడ విచారణ జరిపిస్తారేమోనని, ముందుగానే వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసి మీతో ఉంటానంటూ అభయమిచ్చినట్లుంది’’ అని దాడి ఆరోపించారు.