'రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు'
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రభుత్వం దీక్షతో యజ్ఞంలా పనిచేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. అలాంటివారు రాక్షసుల్లానే మిగిలి పోతారని చె ప్పారు. అమరావతి నిర్మాణాన్ని ఎవరైనా విమర్శిస్తే ఎన్‌టీఆర్ స్ఫూర్తితో బుల్లెట్‌లా వారిపై దూసుకుపోవాలన్నారు. మహానాడు రెండో రోజు గురువారం ఏడు తీర్మానాలు చేశారు. నూతన రాజధాని నిర్మాణంపై తీర్మానం అందులో ఒకటి. పార్టీ నేతలు తీర్మానం ప్రతిపాదించిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ కొందరు రాజధానికి భూమి పూజ ముహుర్తాన్ని కూడా వివాదస్పదం చేశారని సంకల్పబలానికి మించిన ముహుర్తంలేదని అన్నారు.
ఎంతమంది అడ్డం పడినా రాజధాని నిర్మాణం, అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. రాజకీయ నేతలు రెచ్చగొట్టినా, ప్రసార,ప్రచార సాధనాలు, సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరిగినా, చివరకు సోనియా గాంధీ వ్యతిరేకించినా రాజధాని నిర్మాణానికి రైతులు భూములిచ్చారని, వారికి అన్యాయం జరగనివ్వబోమన్నారు. రాజధాని నిర్మాణానికి జూన్ ఆరో తేదీన భూమి పూజ చేస్తామని, దసరా నాడు శంకుస్థాపన చేస్తామన్నారు. శంకుస్థాపన రోజున ప్రధానితో పాటు ముఖ్య నేతలను ఆహ్వానిస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలన్నారు. చారిత్రక నేపధ్యం ఉన్నందునే రాజధానికి అమరావతి అని పేరు పెట్టామని, అమరావతిలో వచ్చి నివాసం ఏర్పరుచుకుంటే చిరాకాలం బతకొచ్చన్నారు. అమరావతి అంటే మృత్యువులేని నగరం అని అర్థమన్నారు.