వాతావరణం బాగులేదట!
శ్రీకాకుళం పాతబస్టాండ్: గత వారం రోజులుగా ఒకటే హడావుడి.. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న చంద్రబాబు పర్యటన కోసం అధికారులు, టీడీపీ శ్రేణులు ఆర్భాటం అంతాఇంతా కాదు. అధికారులైతే రోజువారీ పనులను పక్కన పెట్టేసి పర్యటన ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. సుమారు రూ.2.5 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక రోడ్లు, హెలిప్యాడ్లు, వేదికలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇంతా చేస్తే.. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయిందన్న వార్త ఉసూరుమనిపించింది. కారణమేమిటంటే.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని సూచనలు అందాయంటున్నారు?!.. కానీ అసలు కారణం అది కాదని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. అదేంటంటే.. జిల్లాలో పరిస్థితులు అనుకూలంగా లేవని ఇంటెలిజెన్స్ విభాగం నివేదించడంతోనే చివరి నిమిషంలో పర్యటన రద్దయిందట!..
సీఎం పేషీ నుంచి సమాచారం
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన అనూహ్యంగా రద్దయింది. ఆయన ఇక్కడ పర్యటించాల్సి ఉండగా అది వాయిదా పడినట్లు మంగళవారం సాయంత్రం సీఎం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్‌కు సమాచారం అందింది. వాతావరణం అనుకూలంగా లేదని, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించడం వల్లే ఈ పర్యటన రద్దు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. కానీ జిల్లాలో వాతావరణం అలా లేదు. అడపాదడపా చిన్న వర్షం పడుతున్నా.. ఇబ్బంది పెట్టేంత భారీ వర్షాలు మంగళవారం రాత్రి వరకు జిల్లాలో ఎక్కడా లేవు. పోనీ అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ బులెటిన్లు కూడా లేవు. మరి కోట్లు ఖర్చు పెట్టి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత వాతావరణం సాకుతో సీఎం పర్యటనను ఎందుకు రద్దు చేశారన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.
ప్రజల్లో అసంతృప్తే కారణమా?
వాతావరణ ప్రతికూలత కంటే జిల్లా ప్రజల్లో నెల కొన్న అసంతృప్తే సీఎం పర్యటన రద్దుకు బల మైన కారణంగా కనిపిస్తోంది. రుణమాఫీ, పింఛన్లు, ఆధార్ అనుసంధానం తదితర అంశాల్లో టీడీపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పరిస్థితి అంత సానుకూలంగా లేదని ఇంటెలిజెన్స్ అధికారులు ఒక రహస్య నివేదిక ఇచ్చినట్లు తెలి సింది. వంద రోజుల బాబు పాలనలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేరలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా రుణమాఫీ వంటి అంశాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు గుర్రుగా ఉన్నారని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. దీనికితోడు తక్షణం రుణమాఫీ చేయాలంటూ సోమవారం నుంచే మహిళలు ఉద్యమాలు ప్రారంభించారు. మరోవైపు ఉద్యోగ భద్రత కోసం ఐకేపీ వీఏవోలు సమ్మెబాట పట్టారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి అనుకూలంగా చుట్టుపక్కల ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అక్కడి మత్స్యకారులు చంద్రబాబు ఎదుటే నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఇంతవరకు కొత్తగా ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేయలేదు. ఈ కారణాల వల్ల పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదని ఇంటెలిజెన్స్ నివేదించడంతోనే సీఎం పర్యటన ఆకస్మికంగా రద్దయినట్లు సమాచారం.
టీడీపీ శ్రేణుల దిగాలు
సీఎం పర్యటన రద్దు కావడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఒకవైపు అధికార యంత్రాం గం తమపరంగా ఏర్పాట్లు చేస్తుండగా.. దానికి సమాంతరంగా టీడీపీ నేతలు సీఎం దృష్టిలో పడేందుకు ఎవరిస్థాయిలో వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం సమక్షంలో తమ ఆధిక్యతను, ప్రజల్లో తమకున్న పట్టును ప్రదర్శించుకునేందుకు అంతర్గతంగా సన్నాహాలు పూర్తి చేశారు. ఇక సీఎం దృష్టిలో పడి నామినేటెడ్ పదవులు కొట్టేయాలని ద్వితీయ శ్రేణి, ఛోటా నేతలు ఉత్కంఠగా ఆయన పర్యటన కోసం ఎదురు చూశా రు. వారి ఆశలన్నీ పర్యటన రద్దుతో ఆవిరయ్యాయి.