సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 4, 5 తేదీల్లో ఒక రోజు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఆయన పర్యటనకు వస్తే చేపట్టాల్సిన
శ్రీకాకుళం టౌన్: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 4, 5 తేదీల్లో ఒక రోజు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. ఆయన పర్యటనకు వస్తే చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదివారం ఖరారు చేశారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన జరిపారు. శ్రీకాకుళం, గార మండలాల్లోని 30 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం కిల్లిపాలెం వద్ద నిర్మించిన రక్షిత పథకాన్ని సీఎంతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం మండలం అలికాం పంచాయతీలోని 210 ఎకరాల అల్లి చెరువులో ‘నీరు-చెట్టు’ పనుల పరిశీలనతోపాటు, టెక్కలి లోని తాగునీటి ప్రాజెక్టును సీఎం ప్రారంభించనున్నారు.
అలాగే, బలగ-ఆమదాలవలస రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో నీరు-చెట్టు సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో నాగావళినదిపై పొన్నాడ, గుజరాతీపేట వద్ద నిర్మించిన వంతెనలను సైతం ప్రారంభించే అవకాశం ఉంది. అందులో భాగంగా కలెక్టరుతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ చౌధరి ధనలక్ష్మి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ ఆర్. రవీంద్రనాథ్, కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్.శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ ఇన్‌చార్జి ఈఈ బి.రవీంద్ర, శ్రీకాకుళం మండల పరిషత్ అధ్యక్షుడు గొండు జగన్నాథం తదితరులు సీఎం పర్యటన, ప్రారంభోత్సవ ప్రాంతాలను పరిశీలించారు.