విజయవాడ: డ్రైవర్ల కుటుంబాలలోని పిల్లలకు స్కాలర్షిప్లు అందించేందుకు వారి పూర్తి వివరాల సేకరణకు వెంటనే కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడలో చంద్రబాబు కార్మిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి కార్మికుడికి అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. డ్రైవర్లకు ప్రమాద బీమా పథకం అమలులో జాప్యంపై చంద్రబాబు ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధవళేశ్వరం ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ల కుటుంబాలకు వారం రోజుల్లో బీమా పరిహారం అందించినట్లే రాష్ట్రవ్యాప్తంగా ఇదే చొరవ, స్పందన చూపాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.