
పెద్ద పెంపేమీ కాదు!
విద్యుత్ చార్జీల పెంపును ప్రభుత్వం సమర్థించుకుంది.
కొత్త విద్యుత్ చార్జీలపై చంద్రబాబు ప్రకటన
హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపును ప్రభుత్వం సమర్థించుకుంది. ఐదు శాతం పెంపు సర్వసాధారణమేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొట్టిపారేశారు. ద్రవ్యోల్బణంతో సరిచూస్తే ప్రజలపై వేసిన భారం ఎక్కువేమీ కాదంటూ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఇది తక్కువేనన్నారు. 86 శాతం వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని, కేవలం 14 శాతం వినియోగదారులపై నామమాత్రపు భారం వేశామని అన్నారు. తన హయాంలోనే విద్యుత్ రంగం పరిస్థితి బాగుందని కితాబు ఇచ్చుకున్నారు. తనకన్నా గతంలో పాలించిన కిరణ్ సర్కారే ఎక్కువ చార్జీలు మోపిందని చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ మంగళవారం శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంది. చార్జీల పెంపుపై చర్చించాల్సిందేనని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చార్జీల పెంపుదలపై సభలో ప్రకటన చేశారు. ‘విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చింది నేనే. నేను తొలిసారి 1993లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ర్టంలో విద్యుత్ రంగం పరిస్థితి దయనీయంగా ఉంది. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తొమ్మిదేళ్ళ పాలనలో దీన్ని సంస్కరించా.. తీవ్రమైన విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం. పంపిణీ, సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించడం సాధారణ విషయం కాదు. క్రిసిల్ రేటింగ్‌లో ఏపీ జెన్‌కో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ రంగం మళ్ళీ తిరోగమనంలోకి వెళ్ళింది. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పీఎల్‌ఎఫ్ 78 శాతానికి పడిపోయింది. బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటాయి..’ అని చెప్పుకొచ్చారు.
పెద్దయెత్తున విద్యుత్ కొనుగోళ్లు
‘నేను తిరిగి అధికారంలోకి వచ్చే నాటికి (2014లో) రాష్ట్రంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. ఈ నేపథ్యంలో అనేక చర్యలు చేపట్టి మిగులు విద్యుత్ దిశగా వ్యూహాలు రూపొందించాం. రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు ఉండకూడదన్న లక్ష్యంతో పెద్ద ఎత్తున దీర్ఘ, స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాం. ఫలితంగానే నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం.’ అని బాబు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 23 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచారని, గత ఏడాది చార్జీల పెంపును తాను అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. అందరికీ విద్యుత్ అందించే లక్ష్యంతో వచ్చే ఐదేళ్ళలో రూ. 54,332 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు.
డిమాండ్‌కు మించి కొన్నాం: డిమాండ్‌కు మించి విద్యుత్ ఎందుకు కొన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ.. ‘ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంత విద్యుత్ కొన్నాం. జూన్ నుంచి అవసరమవుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేశాం. వద్దనుకుంటే మేలోగా రద్దు చేసుకోవచ్చు. మా ప్రభుత్వం పారదర్శకంగా ఎక్కడ తక్కువ రేటుకు వస్తే అక్కడే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది..’ అని అన్నారు.
తెలంగాణతో సమస్యల పరిష్కారానికి సిద్ధం
తెలంగాణతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాబు చెప్పారు. వినియోగం ప్రాతిపదికన ఏపీకి 46 శాతం, తెలంగాణ 54 శాతం విద్యుత్ తీసుకోవాలని విభజన చట్టంలో పెట్టినప్పటికీ.. రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన ప్రకారం నడుచుకుంటామని ప్రకటించామని గుర్తు చేశారు. అంతకుముందు మంత్రులు కామినేని, రావెల, అచ్చెన్నాయుడు, యనమల తదితరులు ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు.