
సాక్షి, అమరావతి : అగ్రకులాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల శాతమే ఎక్కువని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అందుకే కేంద్రం ప్రకటించిన ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లలో వారికి ఐదు శాతం ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ, వైసీపీకి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తాము కాపులకు మేలు చేస్తే వక్రీకరిస్తున్నారన్నారు. కులాల్లో చిచ్చుపెట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.
అవినీతిని 85 శాతం నియంత్రించామని మోదీ అనడం హాస్యాస్పదమని, ఆయన పాలనలో సంస్కరణలు పడకేశాయని విమర్శించారు. ఉద్యోగాల సృష్టి సక్రమంగా లేదని, ఆర్‌బీఐకి గతంలో ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు లేదన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, దాన్ని పక్కదారి పట్టించాలని బీజేపీ చూస్తోందని చెప్పారు. మళ్లీ బ్యాలెట్ పేపర్ కావాలనేది అందరి డిమాండ్ అని.. లేకపోతే వీవీ ప్యాట్ రశీదులు 100 శాతం నియోజకవర్గాలకు ఇవ్వాలన్నారు. దావోస్‌లో లోకేశ్ బృందం సత్ఫలితాలు సాధిస్తోందని చంద్ర
బాబు కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment