
'తెలంగాణ లేఖను బాబు వెనక్కి తీసుకోవాలి'
నెల్లూరు : తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబునాయుడు వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తన లేఖను వెనక్కి తీసుకున్న తర్వాతే సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్రను చేపట్టాలన్నారు. షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. ఉదయం పదిగంటలకు ఆత్మకూరులో సాయంత్రం నాలుగు గంటలకు కావలిలో బహిరంగ సభ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
అలాగే షర్మిల బస్సుయాత్ర 10వ తేదీ ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కనిగిరి, సాయంత్రం 4.00 గంటలకు మార్కాపురం బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం 11వ తేదీన గుంటూరు జిల్లాలో ప్రవేశించి ఉదయం 10.00 గంటలకు వినుకొండ, సాయంత్రం 3.00 గంటలకు రేపల్లెలో జరిగే సభలో ఆమె మాట్లాడతారు.