సంకు‘రాత్రి జాగారాలు’ | chandranna gifts no delivery to public | Sakshi
Sakshi News home page

సంకు‘రాత్రి జాగారాలు’

Published Tue, Jan 12 2016 2:35 AM | Last Updated on Sat, Jul 28 2018 5:45 PM

సంకు‘రాత్రి  జాగారాలు’ - Sakshi

సంకు‘రాత్రి జాగారాలు’

♦  4.18 లక్షలమందికి అందని ‘చంద్రన్న కానుక’
♦  సాంకేతిక లోపాలతో పంపిణీలో విపరీత జాప్యం
♦  రేషన్‌డిపోల ముందు కార్డుదారుల బారులు
  సరుకుల కోసం అర్ధరాత్రి వరకూ పడిగాపులు

 సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆడామగా, పిన్నాపెద్దా పడిగాపులు పడుతూ ఉన్న పై ఫొటో అంబాజీపేటలోని ఓ రేషన్‌షాపు వద్ద తీసింది. అప్పుడు సమయం ఎంతో తెలుసా.. ఆదివారం రాత్రి 11 గంటలు! పాపం.. వారి నిరీక్షణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి, ఊరించిన చంద్రన్న సంక్రాంతి కానుక కోసం! ఆ చౌక దుకాణం వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచీ అదే పరిస్థితి.
 
  అలాగని పంపిణీలో డీలరు నిర్లక్ష్యం వహించాడని కాదు.. అలా పూటలుపూటలు.. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా ‘కానుక’ చేతికి అందకపోవడానికి కారణం.. ఈ-పాస్ యంత్రం సరిగా పనిచేయకపోవడమే. ఒక్క అంబాజీపేటలోనే కాదు.. జిల్లా అంతటా చంద్రన్న సంక్రాంతి కానుల పంపిణీలో ఇదే పరిస్థితి. అమలాపురంలో గత మూడురోజులుగా పంపిణీ అర్ధరాత్రి వరకూ కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో గత మూడు రోజులుగా సర్వర్ పనిచేయకపోవటంతో కానుక సరుకులు అందలేదు. రోజూ కార్డుదారులు చౌకడిపోల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకూ నిరీక్షించి చివరకు నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు.
 
 ఎముకలు కొరికే చలిలో ఎదురుతెన్నులు..
 చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో చౌక డిపోల్లో ఆరు రకాల సరకుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ప్రక్రియ ఈ-పాస్ యంత్రాల పుణ్యాన తాబేలు నడక కన్నా మందకొడిగా మారింది. దీంతో వృద్ధులు కూడా ఎముకలు కొరికే చలిలో వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం నుంచి రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో పంపిణీ కాస్త మెరుగుపడింది. మంగళవారం సాయంత్రానికల్లా జిల్లాలోని తెల్లరంగు కార్డుదారులందరికీ చంద్రన్న కానుక అందజేస్తామని అధికారులు చెబుతున్నా కనీసం బుధవారం నాటికైనా పూర్తవుతుందా అన్న సందే హం వ్యక్తమవుతోంది.
 
  జిల్లాలో పాత కార్డులు, ఇటీవల మంజూరు చేసినవి కలిపి మొత్తం 16.43 లక్షల తెల్ల రేషనుకార్డులు ఉన్నాయి. ఇప్పటికే వాటిలో 4.15 లక్షల మంది కార్డుదారులకు క్రిస్మస్‌కు చంద్రన్న కానుక పేరుతో సరుకులు పంపిణీ చేశారు. ఇక మిగిలిన 12.28 లక్షల కార్డుదారులకు ఈనెల 7 నుంచి సంక్రాంతి కానుక పంపిణీ ప్రారంభించారు. అయితే కలెక్టరేట్‌లో ఉన్న సర్వరు కాలిపోవడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించినా నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో లబ్ధిదారుల వేలిముద్రలు ఇ-పాస్ యంత్రంలో సరిగా నమోదవడం లేదు. దీంతో ఒక్కో చౌక దుకాణం వద్ద రోజుకు 50 కార్డులకు మించి పంపిణీ జరగలేదు. సోమవారం రెండో సర్వరును అందుబాటులోకి తేవడంతో ప్రక్రియ కాస్త మెరుగుపడింది.
 
  సోమవారం సాయంత్రానికి క్రిస్మస్, సంక్రాంతి కానుకలు కలిపి మొత్తం 12.25 లక్షల కార్డులకు పంపిణీ పూర్తయిందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియపై కలెక్టరు అరుణ్‌కుమార్ సోమవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. మంగళవారం సాయంత్రం నాటికి కానుకల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
 
 భోగి నాటికైనా అందేనా?
 సంక్రాంతి కానుక సరుకులు ఇంకా దాదాపు 4.18 లక్షల తెల్లకార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కనీసం భోగి నాటికైనా చేతికందుతాయో లేదోనని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దినసరి కూలీలే. రోజుల తరబడి చౌక దుకాణాల వద్ద వరుసలో ఉండటం వల్ల అటు కూలి కోల్పోతున్నామని, ఇటు సరుకులు చేతికి అందట్లేదని లబోదిబోమంటున్నారు. ఇక వృద్ధులైతే నీరసించి, డిపోల ముందే కుప్పకూలిపోతున్నారు. కొందరు కార్డుదారులైతే పిల్లలను సైతం క్యూల్లో నిలబెడుతున్నారు.
 
 కొత్తకార్డుదారులకు కానుకే దిక్కు...
 జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రభుత్వం ఘనంగా పంపిణీ చేసింది ఏవైనా ఉన్నాయంటే కొత్త రేషన్‌కార్డులు ఒక్కటే. అయితే అవి చేతికొచ్చాయనే సంతోషం లబ్ధిదారులకు ఉండడం లేదు. వారికి జనవరి నెల రేషన్ సరుకులు ఉండవు. కేవలం చంద్రన్న కానుకతో సరిపెట్టుకోవాల్సిందే. అయితే రెండు నెలల క్రితమే రేషనుకార్డు అర్హుల జాబితా ఖరారు చేసిన అధికారులు ఆమేరకు సరుకులను ఎందుకు సిద్ధం చేయలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రతినెలా రేషను సరుకులు ఇస్తామని అధికారులు సరిపెడుతున్నారు.
 
 
 నేటి సాయంత్రానికి పూర్తి...
 క్రిస్మస్‌తో కలుపుకొని చంద్రన్న కానుకగా సరుకులు జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి మొత్తం 12.25 లక్షల కార్డుదారులకు అందజేశాం. ఇంకా దాదాపు నాలుగు లక్షల కార్డులకు సరుకులు అందజేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఒకే సర్వరు ఉండటం, అదీ సరిగా పనిచేయకపోవడం వల్ల పంపిణీ జాప్యమైంది. సోమవారం నుంచి రెండు సర్వర్లు అందుబాటులోకి తెచ్చాం. మంగళవారం సాయంత్రంలోగా పంపిణీ పూర్తి చేస్తాం.
 - జి.ఉమామహేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement