బంజారాహిల్స్ : నగరంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా నిండా మునగడం ఖాయం. సబ్బుబిళ్లను అందంగా ప్యాకింగ్ చేసి ఖరీదైన ఐఫోన్ అంటూ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను యువకులు వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఏ మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు.. బంజారాహిల్స్ ప్రధానరోడ్డులో. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని ముఫకంజా కళాశాల ఎదుట మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు తమ వద్ద ఐఫోన్లు ఉన్నాయి..తక్కువ ధరకు విక్రయిస్తామని రోడ్డుపై వెళ్తున్న ఆనంద్‌కుమార్ అనే యువకుడిని అడిగారు.
నెలరోజుల క్రితం దేవరకొండబస్తీలో నివాసముండే జాహెద్ అనే యువకుడు ఇలాగే ఐఫోన్ అనుకొని కొనుగోలు చేయగా విప్పి చూస్తే సబ్బు బిళ్ల అని తేలిన విషయాన్ని విన్న ఆనంద్ అదే తరహాలో ఈ మోసం ఉండి ఉంటుందని ఆ ఫోన్ ప్యాక్ తీసుకొని.. డబ్బులు ఇంట్లో ఉన్నాయని చెప్పి వెళ్లి జరిగిన విషయాన్ని స్నేహితుడికి చెప్పాడు. వీరిద్దరూ రాగానే బైక్‌పై ఉన్న వ్యక్తులు ఉడాయించారు.
అప్రమత్తమైన ఆనంద్‌తోపాటు ఆయన స్నేహితుడు వారిని వెంబడించారు. చివరకు కేంద్రమంత్రి బలరాంనాయక్ గన్‌మెన్లు వారిద్దరిని పట్టుకున్నారు. మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. కొన్నాళ్లుగా సబ్బు బిళ్లలను అందంగా ముస్తాబు చేసి ఐఫోన్లుగా నమ్మిస్తూ ఒక్కొక్కటి రూ.2 వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
సబ్బు బిళ్ల...జేబు గుల్ల
Published Wed, Nov 6 2013 10:28 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement