
తల్లిదండ్రులు ప్రవీణకుమారి, వెంకట్రామన్, సాధించిన కప్‌లు, షీల్డ్‌లతో చెస్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకట్రామన్
చిత్తూరు, తిరుపతి సిటీ :ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆ బాలుడికి తల్లి ఇచ్చిన పుట్టినరోజు బహుమతి ప్రపంచ స్థాయి క్రీడాకారునిగా ఎదిగేందుకు ప్రేరణ కలిగింది. ఆ ప్రేరణతోనే తిరుపతికి చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకట్రామన్ చెస్ ఆటలో ‘గ్రాండ్ మాస్టర్’ (2,520 రేటింగ్) స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో ఏడాది లోపు ‘సూపర్ గ్రాండ్ మాస్టర్’ రేటింగ్ తెచ్చుకోవాలన్నదే తన ముందున్న లక్ష్యమని తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. చెస్ ఆటలో ఊహకందని ఎత్తులు వేస్తూ.. తనకంటే మెరుగైన బ్లిడ్జ్, ర్యాపిడ్, క్లాసికల్ విభాగాల్లో ఉన్న ఆటగాళ్లను చిత్తుచేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చాడు. తాజాగా ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీలో జరిగిన చెస్ ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని 4వ గ్రాండ్ మాస్టర్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం తిరుపతిలోని ఒక ప్రయివేట్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కార్తీక్ వెంకట్రామన్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు.
సాక్షి : మీ కుటుంబ నేపథ్యమేంటి..?
కార్తీక్ : మా తల్లిదండ్రులు ప్రవీణకుమారి, వెంకట్రామన్ పాకాల మండల కేంద్రంలోని సత్యమ్మగుడి వీధిలో నానమ్మ, తాతయ్యతో కలసి ఉండేవారు. అమ్మానాన్న మా చదువుల కోసం తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. నాన్న విజయభారతి టీవీఎస్ షోరూం, విజయభారతి టాటా కార్ల షోరూం అధినేతగా ఉన్నారు. అమ్మ గృహిణి. చెల్లాయి అనూష 10వ తరగతి చదువుతోంది.
సాక్షి : చెస్ ఆటలో మీకు ప్రేరణ ఎవరు..?
కార్తీక్ : నాకు ఏనిమిదేళ్ల వయసు వరకు చెస్ ఆటంటేనే తెలియదు. అమ్మ తన భర్తడే గిఫ్ట్‌గా చెస్ బోర్డును ఇచ్చింది. గేమ్ నియమనిబంధనలు చెప్పింది. అప్పట్నుంచి చెస్‌పై మక్కువ పెంచుకున్నా.
సాక్షి : ఆ తర్వాత చెస్ ఆటలో ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నారు..?
కార్తీక్ :చెస్‌పై నాకున్న ఇంట్రస్ట్ చూసి నాన్న మొదట చెస్ సీనియర్ కోచ్ ఇంజం శివకేశవులు వద్ద కొన్ని నెలల పాటు శిక్షణ ఇప్పించారు. అనంతరం నవీన్ అనే కోచ్ చెస్ ఆటలో మెళకువలు నేర్పించి ప్రొత్సహించారు. తదుపరి మరింత మెరుగైన శిక్షణ కోసం వైజాగ్ నుంచి పి.రామకృష్ణ అనే కోచ్‌ను పిలిపించి 15 రోజుల పాటు శిక్షణ ఇప్పించారు నాన్న. ఆ తరువాత నేనే ఆటలోని మెళకువలను నేర్చుకుంటూ స్కూల్ గేమ్స్ స్థాయిలోనే చెస్ టోర్నమెంట్‌లకు వెళ్లేవాడిని. 5వ తరగతిలోనే టోర్నమెంట్‌లకు వెళుతూ 1606 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ తెచ్చుకున్నా. 7, 8, 9 తరగతుల సమయంలో చెస్ ఆటపైనే పూర్తిగా ఫోకస్ పెట్టా. ఆ సమయంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లి 1950 ఇంటర్నేషనల్ ర్యాకింగ్ సాధించా. 10వ తరగతి బెంగళూరులోని స్టాండర్డ్ ఇంటర్నేషనల్‌లో చది వాను. అప్పటికే 2,305 రేటింగ్‌లో ఉన్నా. అనంతరం తమిళనాడులోని వేళమ్మాల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంఈసీ గ్రూప్ చదివి 95 శాతం పైగా(1141/1200) మార్కులు సాధించా. అటు చదువులోనూ, ఇటు చెస్‌లోనూ రాణిస్తూ వచ్చా.
సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లతో మీ ఆటతీరు..?
కార్తీక్ :మనదేశ ఆటగాళ్లు, యూరప్, యూఎస్, టర్కీ ఆటగాళ్ల ఆటతీరులో చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ఆటగాళ్లు సేఫ్, పొజిషనల్‌గా ఆడుతారు. అదే వాళ్‌లైతే అగ్రస్సివ్‌గా, అటాకింగ్ స్టైల్లో ఆడతారు.
సాక్షి : ఇతర దేశాల ఆటగాళ్లను ఎలా ఎదుర్కొంటారు..?
కార్తీక్ : ఇతర దేశాల ఆటగాళ్లతో ఆడేటప్పుడు ముందుగా వారి ఆటతీరును ఆన్‌లైన్‌లో పరిశీలిస్తా. అందుకు సంబంధించిన బుక్స్ చదువుతా. ఇతర దేశాల్లో పోటీలు ఉన్నçప్పుడు ప్రతిరోజు అయిదారు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తా.
సాక్షి : చెస్‌కు ఆదరణ ఉందంటారా..?
కార్తీక్ : మన రాష్ట్రంలో చెస్ ఆటలో అప్‌కమింగ్ ప్లేయర్స్ రావటం లేదు. అండర్–19లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. చెస్ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
సాక్షి : 5వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచినందుకు ఎలా ఫీలవుతున్నారు?
కార్తీక్: ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదాలో హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్‌బాబు సరసన 5వ ప్లేయర్‌గా నిలవడం సంతోషంగా ఉంది.
సాక్షి : గ్రాండ్‌మాస్టర్ హోదాలో సీఎంను కలిశారా..?
కార్తీక్ : లేదు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలవనున్నాం. చెస్ జిల్లా, రాష్ట్ర అసోషియేషన్ ప్రతినిధులతో కలసి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాం. సీఎం క్రీడలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏడాదిలోపే సూపర్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధిస్తాననే నమ్మకం ఉంది.
సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సూచనలు..?
కార్తీక్ : ఆటలో ఓటమి చెందినా నిరుత్సాహ పడకూడదు. ఆటను మరింత మెరుగుపరచుకోవాలి. ఆటలోని తప్పులను సరిదిద్దుకుని ముందుకెళ్లాలి. మనదేశంలో టోర్నమెంట్‌లు తక్కువ. అదే యూరప్ లాంటి దేశాల్లో టోర్నమెంట్లు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ ఆటగాళ్లను అసోషియేషన్లు, ప్రభుత్వాలు ప్రొత్సహిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆటగాళ్లను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
జీఎం టైటిల్‌కు సంబంధించిన వివరాలు..
♦ 2017 ఆగస్టులో బార్సిలోనాలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ చెస్ పోటీల్లో తొలి జీఎంను కైవసం చేసుకున్నాడు.
♦ 2018లో జూన్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన కిట్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించి రెండవ జీఎం నార్మ్ సాధించాడు.
♦ ఈ ఏడాది ఆగస్టు 16న ఇటలీలో జరిగిన స్పిలిమ్‌బర్గ్ ఓపెన్‌లో 6 పాయింట్లు సాధించి 3వ జీఎం నార్మ్ కూడా పొంది గ్రాండ్‌మాస్టర్ హోదా సొంతం చేసుకున్నాడు.
♦ ఈ నెల 4 నుంచి 16వ తేది వరకు టర్కీ దేశంలో జరిగిన ప్రపంచ స్థాయి జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో 4వ గ్రాండ్‌మాస్టర్ స్థానం కైవసం చేసుకున్నాడు.
కార్తీక్ సాధించిన విజయాలు..
♦ అండర్–13 రాష్ట్ర చాంపియన్, అండర్–17 2017లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం
♦ అండర్–17 జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో బంగారు పతకం
♦ అండర్–19 జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో సిల్వర్ మెడల్
♦ ఏపీ స్టేట్ అండర్–9 గ్రూపులో ద్వితీయ స్థానం
సాధించిన పతకాలు..
♦ 2019లో తిరుపతి జూనియర్ చాంబర్ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రాడిజీ అవార్డు
♦ 2010లో గోవాలో జరిగిన ఏపీ ఇన్ నేషనల్ స్కూల్ గేమ్స్ పోటీల్లో కాంస్య పతకం
♦ 2010లో శ్రీలంకలో జరిగిన ఏషీయన్ స్కూల్ గేమ్స్‌లో అండర్–11 విభాగంలో బంగారు పతకం సాధించి పోలెండ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు.
♦ శ్రీలంకలో జరిగిన టీమ్ ఏషియన్ స్కూల్ గేమ్స్‌లో టీమ్ మెడల్ సాధించి సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత
♦ 2018 జూలైలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్
Comments
Please login to add a commentAdd a comment