
‘పాప’ం కన్నపేగుకు భారమై!
ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో...లేక ఆడపిల్లని అలుసు పుట్టిందో... పండంటి బిడ్డను పురిటిలోనే వదిలించుకుంది. మానవత్వం మంటగలిసేలా..అమ్మతనం చిన్నబోయేలా చేసింది..
పాలకొండ: ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో...లేక ఆడపిల్లని అలుసు పుట్టిందో... పండంటి బిడ్డను పురిటిలోనే వదిలించుకుంది. మానవత్వం మంటగలిసేలా..అమ్మతనం చిన్నబోయేలా చేసింది..బోసి నవ్వులు చూసైనా కన్నపేగు కరగలేదేమో.. నిర్ధాక్షణ్యంగా ఆస్పత్రి ఆరుబయట అర్ధరాత్రి వదిలిపెట్టిసి అమ్మతనానికి మచ్చతెచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఏ కుక్కలకో ఆ శిశువు బలికాకుండా ఆస్పత్రి సిబ్బంది కంటపడింది. చివరకు శిశు సంరక్షణ సంస్థ చేతికి చేరింది. ముద్దులొలిపే రూపం...బోసినవ్వు కలబోసిన శిశువును దత్తత తీసుకొనేందుకు పలు కుటుంబాలు ముందుకొచ్చినా శాఖాపరమైన చర్యలతోనే అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాలకొండ వంద పడకల ఏరియా ఆస్పత్రి ఆవరణలో సీమాంక్ కేంద్రం ఉంది. శనివారం అర్ధరాత్రి దాటాక కేంద్రం బయట నుంచి చిన్నపిల్ల ఏడుపు వినిపించడంతో సిబ్బంది బయట తలుపులు తెరిచి చూశారు. ఆరుబయట వరండాలో ఓ శిశువు రోదనలు వినిపించాయి. లైట్లు వేసి చూసేసరికి ఆడపిల్లను ఎవరో కని అక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టు గుర్తించారు. శిశువును చేరదీసి అందుబాటులో ఉన్న పాలు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు అయిన డాక్టర్ రవీంద్రకుమార్‌కు విషయం తెలియజేశారు. ఆయన పాపను పరిశీలించారు. ఎటువంటి లోపం లేదని, 300 గ్రాముల బరువు ఉండడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా పాప ఉందని గుర్తించారు.
సమాచారాన్ని ఐసీడీఎస్ పీవో కె.నాగమణికి చేరవేశారు. ఆమె జిల్లా శిశుసంరక్షణ కేంద్రానికి సమాచారం అందించడంతో ఆ సంస్థ అధికారి కె.వి.రమణ, మేనేజర్ ఎల్.లక్షుంనాయుడులు ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకొని శిశుసంరక్షణ కేంద్రానికి పాపను తరలించారు. విషయం బయటకు తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పాప తెల్లటి రంగుతో, ముఖంపై చిరునవ్వుతో బొడ్డు వీడకుండా ఉండడం చూసి చలించిపోయారు. ఓ ఉన్నత స్థాయి కుటుంబం నుంచి దంపతులు పాపను తమకు అప్పగించాలని, కన్నబిడ్డకంటే ఎక్కువగా చూసుకుంటామని వేడుకున్నారు. తమకు పిల్లలు లేనందున తమ ఆస్తుపాస్తులకు వారసురాలిగా ఉంచుతామని హామీనిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం శిశుసంరక్షణ శాఖకు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించిన తరువాత పాపను అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
వద్దునుకుంటే అప్పగించండి..
ఎవరైనా పిల్లలను పెంచలేమనుకున్నా, కాన్పు అయ్యేక వద్దునుకున్నా తమకు సమాచారం అందించాలని జిల్లా శిశుసంరక్షణ సంస్థ అధికారి కె.వి.రమణ సూచించారు. పిల్లలను తుప్పట్లో పడేయడం, చెత్త బుట్టల్లో వేయడం, లేదా బ్రూణహత్యలు వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. తమకు పిల్లలను అప్పగించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.