నల్లగొండ : నల్లగొండ శిశుగృహలో మృత్యుఘోషకు అధికారుల అలసత్వమే ప్రధాన కారణమని తెలుస్తోంది. దేవరకొండ, నల్లగొండ శిశుగృహాలను కలిపి ఒకే చోట నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ప్రత్యేక చిన్న చిన్న గదులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. 20 మంది ఉండాల్సిన స్థానంలో 50 మంది శిశువులకు ఒకే హాల్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఏడాది లోపు వయసున్న శిశువుల ఎదుగుదలకు తగ్గట్టుగా గదిలో 28 నుంచి 30 డిగ్రీల వెచ్చదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. పగటిపూట ఉష్ణోగ్రత ఫర్వాలేదనిపించినా రాత్రివేళలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి గదుల్లో వెచ్చదనం ఉండేలా ఏర్పాటు చేయాలని వైద్యులు సూచించారు. 0–1 వయసున్న పిల్లల బరువు మొదటి మూడు నెలల పాటు తప్పనిసరిగా పరిశీలించాలి.
రోజుకు 20 నుంచి 30 గ్రామాల బరువు పెరగాలి. ప్రతి మూడు లేదా నాలుగు గంటలకో సారి పిల్లలకు ఆహారం అందించాలి. కానీ శిశుగృహలో ఇలాంటి సౌకర్యాలు లేవని పిల్లలకు వైద్య చికిత్సలు అందించిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. వసతులు లేకపోవడంతో ఆ ప్రభావం పిల్లల ఎదుగుదల పైన పడుతోంది. పోషణ సరి గా లేక రోజురోజుకీ బరువు తగ్గిపోయి వారిలో రోగనిరోధక శక్తి ప్రమాదకర స్థాయికి చేరుతోంది. దీంతో పిల్లలకు ఆస్తమా, దగ్గు, జలుబు, డయేరియా, శ్వాసకోస సంబంధిత వ్యాదులు సోకినప్పుడు వాటిని భరించకలిగే శక్తి లేక త్వరగా నీరసించిపోతున్నారని డాక్టర్ సుధాకర్ తెలిపారు.
పర్యవేక్షణాలోపం...
శిశుగృహలో 25 మంది ఆయాలు, ఇద్దరు మేనేజర్లు పనిచేస్తున్నారు. వీరంతా రెండు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వరిస్తున్నారు. దీంట్లో ఇద్దరు, ముగ్గురు ఆయాలను అధికారుల ఇళ్లలో సొంత పనులకు కూడా వాడుకుంటున్నారు. పిల్లల పెంపకం, పోషణ గురించి ఆయాలకు ఎలాంటి శి క్షణ ఇవ్వలేదు. దీంతో ఒక చిన్నారికి పాలు పట్టించే క్రమంలో అవి గొంతులోకి పోకుండా శ్వాసనాళంలో అడ్డుపడి ఊపిరాడక చనిపోయింది. పిల్లలను పర్యవేక్షించేందుకు ఏఎన్‌ఎం స్థాయి కలిగిన ఇద్దరు నర్సులు ఉన్నారు. విధి నిర్వహణలో నర్సులు సమయాపాలన పాటించడం లేదని తెలిసింది. ఇంత మంది పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు జీఎన్‌ఎం స్థాయి కలిగిన నర్సులు ఉంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు ఆస్పత్రి పాలైనప్పుడు అధికారులు కాకుండా శిశుగృహ సిబ్బంది, ఆయాలు వెళ్తున్నారు. దీంతో మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యులు సంషయిస్తున్నారు. శిశుగృహకు శాశ్వత వైద్యులు లేరు. దీంతో ఇప్పటికే నలుగురిని మార్చారు. ఈ నాలుగు మాసాల వ్యవధిలోనే ఇద్దరు వైద్యులు మారారు. వైద్యం ఖర్చులు భరించలేకనే తరచూ వైద్యులను మారుస్తున్నట్లు తెలిసింది.
నిధుల సమస్య..
శిశుగృహ నిర్వహణకు ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కావడం లేదు. కేంద్రంలో శిశువుల సంఖ్య పెరి గిపోతుండటంతో అందుకు అయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. పిల్లలకు సోకే జబ్బుల స్థితిని బట్టి ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స అందించాలంటే ఖర్చు భారీ గానే అవుతోంది. కలెక్టర్ ప్రత్యేక గ్రాంటు నుంచి మార్చిలో రూ.8లక్షలు విడుదల చేశారు. ఈ డబ్బులతోనే ఇప్పటి వరకు శిశుగృహను నెట్టుకొచ్చారు. కాలక్రమేణ నిర్వహణ భారంగా మారడంతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అధికారులు సంకుచిత నిర్ణయాలు తీసుకున్నారు. పోషక విలువలు ఉన్న పాలపౌడర్ కాకుండా నాసిరకాన్ని వినియోగించారు. దీంతో పిల్లల ప్రాణాలు చిక్కుల్లో పడి ఏడుగురు చనిపోయారు. శిశుగృహ నిర్వహణకు రూ.30 లక్షలు కావాలని డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపిన ప్రయోజనం లేకుండా పోయింది.
తక్కువ బరువు ఉంటున్నారు
శిశుగృహ నుంచి వస్తున్న చిన్నారులు తక్కువ బరువు ఉంటున్నారు. జలుబు, దగ్గు, బ రువు పెంచడం వరకు ఇక్కడ సేవలు అందిస్తున్నాం. పిల్లల శరీరంలో పల ఏమున్నది అనేది తెలియదు. దాంతో నీలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నాం. ఎక్కువ మంది పిల్లల్లో డయేరియా సమస్య కూడా కనిపిస్తోంది. పిల్లలకు సోకే వ్యాధులు ఒకదాని తర్వాత మరొకటి మొదలై చివరకు హైపోథెరిమి వరకు పోయే ప్రమాదం ఉంది.
– దామెర యాదయ్య, ప్రభుత్వ వైద్యుడు, (చిన్నపిల్లలు)
Comments
Please login to add a commentAdd a comment