బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్ పక్కన రాజశేఖర్‌బాబు
విక్రాంత్ పాటిల్.. పక్షం రోజుల ముందు చిత్తూరుకు కొత్త ఎస్పీగా నియమితులైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. డైరెక్ట్ ఐపీఎస్ అధికారి కావడంతో ప్రజల్లో ఆయనపై అంచనాలు పెరిగాయి. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతారని.. పోలీసుశాఖలోని అవినీతిని ప్రక్షాళన చేస్తారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విక్రాంత్ పాటిల్ చిత్తూరులో బాధ్యతలు స్వీకరించారు. తన ముందున్న బాధ్యత, తన పరిపాలన శైలి గురించి ఆయన వివరించారు.
చిత్తూరు అర్బన్: మాది కర్ణాటక రాష్ట్రంలోని దువ్వాడ ప్రాంతం. 2012 సివిల్స్ రాసి ఐపీఎస్ ఆఫీసర్‌గా సెలక్ట్ అయ్యా. నా తొలి పోస్టింగ్ ఏఎస్పీగా తమిళనాడులోని కన్యాకుమారి. అక్కడ రెండేళ్లు పనిచేశాను. అక్కడి నుంచి కంచి ఏఎస్పీగా కొన్నాళ్లు పనిచేసి ఆంధ్రాకు బదిలీ అయ్యాను. విజయనగరం ఏఎస్పీ, విజయనగరం ఓఎస్డీగా పనిచేస్తూ చిత్తూరుకు వచ్చాను. ఎస్పీగా ఇదే నా తొలి పోస్టింగ్. సీఎం నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటా. అల్టిమేట్‌గా సామాన్యులకు న్యాయం జరగాలన్నదే నా మోటివ్.
అనుభవం ఉంది
కర్ణాటకలో పుట్టి పెరిగాను. తమిళనాడులో పనిచేశాను. ఓ కేసు విషయమై 2014లో చిత్తూరు వచ్చాను. సీఎం సొంత జిల్లా కావడంతో నాపై బాధ్యత ఎక్కువ ఉంటుంది. చిత్తూరు రెండు రాష్ట్రాలకు బోర్డర్. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలు, నేరస్తుల ఆలోచనా విధానాలపై నాకు అవగాహన ఉంది. అనుభవం కూడా ఉంది.
నిష్పక్షపాతంగా ఎన్నికలు
మరో 6–8 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. మాపై బాధ్యత పెరుగుతుంది. పోలీసు పాత్ర చాలా కీలకం. మా వరకు ఎలాంటి విమర్శలు రాకుండా పనిచేస్తాం. ఏ రాజకీయ పార్టీతో పనుండదు. నిజాయితీగా ఎన్నికలు జరగడానికి బాధ్యతగా పనిచేస్తాం.
నా ముందున్నది.
చిత్తూరులోని కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. దీన్ని మరింత పటిష్టం చేస్తా. ఎర్రచంద నం స్మగ్లింగ్, మహిళలపై దాడులను అరికట్టడానికి మిషన్ ప్రారంభమవుతుంది. జిల్లాలో పుణ్యక్షేత్రాలు ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని తగ్గించాల్సి ఉంది. సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా.
ఫ్రెండ్లీ పోలీస్
ప్రజలు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. పోలీసులు.. ప్రజల మధ్య ఓ స్నేహ పూర్వక వాతావరణం ఉండాలి. అదే సమయంలో తప్పు చేసిన వారిపై చట్టపరంగా ముందుకెళతాం. అన్యాయం చేసిన వారిని, అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు. పోలీసు సంక్షేమానికి చేయూత ఇస్తా. హోంగార్డు నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు వారి సాధకబాధకాలు వినడానికి సమయం కేటాయిస్తా.
Comments
Please login to add a commentAdd a comment