సాక్షి, తిరుపతి: పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా అనీషారెడ్డిని ప్రకటించడం జిల్లా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి మింగుడుపడటం లేదని తెలిసింది. ఈమె అభ్యర్థిత్వాన్ని అమర్‌నాథ్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు భోగట్టా. ఈమె ఎంపిక విషయంలో సీఎం నుంచి తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పుంగనూరు అసెంబ్లీ స్థానం టీడీపీ అధినేతకు మొదటి నుంచీ పెద్ద సవాలు. ఇక్కడ పాగా వేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొనే అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడ్డారు.
జిల్లా నాయకులతో పలుమార్లు సమావేశమై చర్చించారు. ఈ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం అసాధ్యమని, తెలిసి చేతులు కాల్చుకోవడం ఎందుకని పలువురు టీడీపీ నేతలు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఈ సారి పుంగనూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా... పోటీ చేయడానికి ఇష్టపడలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో తనే ఎవరో ఒకరిని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా పలువురితో చర్చలు జరిపారు. ఈ చర్చలు కొలిక్కి వచ్చే సమయంలో సీఎం చంద్రబాబు అనీషారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అమర్‌నాథ్‌రెడ్డి షాక్ అయ్యారు.
అమర్‌కి ఇష్టం లేదు.. అయినా ఇస్తున్నా
పుంగనూరు అభ్యర్థిగా పోటీ చేయాలని టీడీపీ నేత శ్రీనాథ్‌రెడ్డి సతీమణి, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మరదలు అనీషారెడ్డి 2004 నుంచి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 2004లో వెంకటరమణరాజును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరి టికెట్ ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది. మళ్లీ టీడీపీలోకి వచ్చి 2014లోనూ పుంగనూరు టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. రెండు పర్యాయాలు టీడీపీ నుంచి తిరస్కారం ఎదురైంది. టికెట్ రాకపోవడానికి బంధువులతో పాటు అమర్‌నాథ్‌రెడ్డి కూడా కారణమనే ప్రచారం జరిగింది. క్వారీ వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా అమర్‌నాథ్‌రెడ్డి నుంచి అనీషారెడ్డి విడిపోయినట్లు తెలిసింది.
అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అమర్‌నాథ్‌రెడ్డి తనకు నమ్మకంగా ఉన్న వారిని పుంగనూరు అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావించారు. ఈ విషయమై చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించినా మంత్రి వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో అనీషారెడ్డి పేరు ప్రస్తావనకు వస్తే అమర్‌నాథ్‌రెడ్డి వ్యతిరేకించినట్లు సమాచారం. చివరకు మంత్రికి సమాచారం లేకుండా చంద్రబాబు అనీషారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జ్‌గా ప్రకటిం చారు. ‘అమర్‌నాథ్‌రెడ్డి వ్యతిరేకించినా... నీకే పుంగనూరు బాధ్యతలు అప్పగిస్తున్నా’ అని సీఎం స్వయంగా చెప్పినట్లు ఆమె వర్గీయులంటున్నారు. సీఎం ప్రకటనతో రెండు కుటుంబాల మధ్య మరింత అంతరం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment