
తేనె చినుకులేవీ..!
- మన్యంలో తగ్గిపోతున్న తేనె దిగుబడి
- రేడియేషన్ ప్రభావం, చెట్లు తగ్గడం కారణం
- ఒకప్పుడు 2,000 క్వింటాళ్ల సేకరణ
- ఇప్పుడు సగం కూడా కష్టమే
పుట్ట తేనె...ఈ పేరు తలవగానే నోరంతా తియ్యగా మారుతుంది. ఇక రెండు చుక్కలు గానీ నోట్లో వేసుకుంటే.... మ్‌మ్‌మ్ ...ఇక మాధుర్యమంటే ఇదేనా అని పరవశించాల్సిందే. అడవుల నుంచి అలా తీసుకొచ్చిన తేనెపట్లను మన కళ్ల ముందే పిండి స్వచ్ఛమైన తేనెను మనకు ఇస్తుంటే... అబ్బ...ఆ ఆనందమే వేరు..కానీ అవన్నీ పాత జ్ఞాపకాలే..ఇప్పుడు తేనె పట్టూ లేవు...తేనే లేదు
కొయ్యూరు,.న్యూస్‌లైన్: అడవులు అంతరించడం..మొబైల్ సిగ్నల్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా తేనెటీగలు దారి మళ్లడం. గిరిజన యువకులకు తేనెసేకరణపై సరైన అవగాహణ లేకపోవడం.. కొత్తగా ఉద్యోగ లేదా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు కాఫీ తోటలకు పురుగు మందులు కొట్టడం లాంటి కారణాలతో తేనె దిగుబడి మన్యంలో విపరీతంగా పడిపోతుంది.
గిరిజన సహకార సంస్థ నుంచి సైరె న ప్రోత్సహం లేకపోవడం ఒక కారణమైతే అర్హులైన బ్రాంచి మేనేజర్లు లేకపోవడం మరో కారణం వెరసి జీసీసీకి అత్యంత రాబడి తీసుకువచ్చే తేనె దిగుబడి ప్రతీ యేడాది తగ్గిపోతుంది. ఏటా దాదాపు రెండు మూడువేల క్వింటాళ్ల తేనె దిగుబడి వచ్చేది. అయితే ఇది రానురాను తగ్గినోతోంది. పాడేరు డివిజన్‌లో వెయ్యి క్వింటాళ్లు రావడం కష్టంగా మారుతోంది.
గిరిజన యువత నిరాసక్తత
ఒక తరం అయిపోయింది. ప్రస్తుత తరం అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి పెట్టడం లేదు. చదువుకున్నవారు వివిధ ఉద్యోగాలులేదా ఉపాధి మార్గాలు ఎంచుకుంటున్నారు.పుట్టి పెరిగిన గ్రామంలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సేకరించే వారు సైతం తగ్గిపోయారు.
దారి మళ్లుతున్న తేనెటీగలు
ఇది కాకుండా సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా తేనెటీగలు బయటకు వెళ్లి వచ్చిన తరువాత దారి మళ్లుతున్నాయి.తిరిగి తేనెపట్ల వద్దకు రాలేకపోతున్నాయి.కాఫీ తోటలకు ఇటీవల కాలంలో పురుగులు మందు లు కొట్టడం కూడా కారణంగా మారుతుంది.దీంతో ఈగలు ఇతర ప్రాంతాలకు పోతున్నాయి. దీనికి తోడుగా చెట్లు నరకివేయడంతో సరైన వాతావరణం లేకపోవడంతో తేనెపట్టు పెట్టేందుకు వీలు లేకుండాపోతుంది.