విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా 89 పూరిళ్లు అగ్నికి ఆహుతైన ఘటన శనివారం గుంటూరు నగర శివారు లాలుపురం పంచాయతీ పరిధిలోని లింగాయపాలెం అల్లూరి సీతారామరాజు కాలనీలో జరిగింది.
అగ్గి దేవుడు భగ్గుమన్నాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో విరుచుకుపడ్డాడు. 89 ఇళ్లను భస్మీపటలం చేశాడు. నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేశాడు. దాదాపు 350మంది కట్టుబట్టలతో మిగిలారు. బూడిదగా మారిన ఇళ్లను చూసిన బోరున విలపించారు. గుంటూరు నగరానికి సమీపంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో శనివారం ఈ దుర్ఘటన సంభవించింది.
గుంటూరు రూరల్ : విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా 89 పూరిళ్లు అగ్నికి ఆహుతైన ఘటన శనివారం గుంటూరు నగర శివారు లాలుపురం పంచాయతీ పరిధిలోని లింగాయపాలెం అల్లూరి సీతారామరాజు కాలనీలో జరిగింది. కాలనీలోని ఓ ఇంట్లో ఉదయం 10 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అది చుట్టు పక్కల నివాస గృహాలకు అంటుకోవడంతో పెను ప్రమాదం సంభవించింది. గుంటూరు రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు కాలనీ జీరో లైన్‌కు చెందిన గోలి గురవమ్మ అనే మహిళ ఇంటి బయట వంట వండుకుంటోంది. ఇంటి వెనుక భాగం నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
దీంతో గోలి గురవమ్మ కేకలు పెట్టింది. మరో వైపు ఎండ తీవ్రతతో పాటు ఈదురు గాలులు విపరీతంగా ఉండడంతో ఆ మంటలు కాస్తా చుట్టు పక్కల ఇళ్లకు అంటుకున్నాయి. చుట్టు పక్కల నివాసాలలో ఉన్న 8 సిలిండర్లు పేలడంతో మంటలు మరింతగా ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశారు. ఓ చేత్తో చిన్నపిల్లలను ఎత్తుకుని, మరో చేత్తో అందిన సామగ్రిని చేత పుచ్చుకుని ఆ ప్రాంతం నుంచి ఇవతలకు వచ్చారు. జీరో లై న్‌లో మొదలుకున్న మంటలు కాస్తా 5వ లైను వరకు పాకాయి. సమాచారం తెలుసుకున్న ఆర్డీవో బి.రామమూర్తి, తహాశీల్దార్ తాతా మోహన్‌రావు, అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ అధికారి రత్నబాబు, రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు ఆర్‌ఐ గోపికృష్ణ, ఎంపీడీవో పద్మశ్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనువాసు, మండల ఎంపీపీ తోట లక్ష్మీకుమారి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి నాలుగు ఫైర్ ఇంజన్‌లతో మంటలు అదుపు చేశారు.
రెవెన్యూ అధికారుల విచారణలో సుమారు 89 నివాస ప్రాంతాలు అగ్నికి ఆహుతి అయినట్టు గుర్తించారు. సుమారు రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశం మేరకు ప్రతి బాధిత కుటుంబానికి రూ.5 వేలు నగదు, 20 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, వంటసామగ్రి అందజేస్తామని ఆర్డీవో రామమూర్తి తెలిపారు. మధ్యాహ్నం భోజన వసతి కల్పించి, చిన్నారులకు పాలు పంపిణీ చేశారు.
బాధితులను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే
అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం కింద రూ.5వేల రూపాయలను అందజేశారు. సోమవారం కుమార్తె వివాహం జరగాల్సి, ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కృష్ణారావును ఆదుకుంటామని చెప్పారు.