- తొలి సంతకాలతో ప్రజలను ఏమార్చారు
- హామీలు అమలుకాక రైతు, మహిళ, యువతకు కష్టాలు
- రాష్ట్ర విభజన హామీల అమలు కోసం కార్మిక పోరాటాలు
- సీఐటీయూ రాష్ట్ర మహాసభ తీర్మానాలు వెల్లడించిన నేతలు ఉమామహేశ్వరరావు, ధనలక్ష్మి
విజయవాడ : ఎన్నికల్లో అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు చేసిన వాగ్దానాలనే మాఫీ చేసే దుస్థితికి దిగజారిపోయారని సీఐటీయూ రాష్ట్ర నేతలు ధ్వజమెత్తారు. విజయవాడ వేదిక ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 14వ మహాసభల్లో చేసిన తీర్మానాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, తీర్మానాల కమిటీ కన్వీనర్ కె.ధనలక్ష్మి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి, మద్యం బెల్ట్‌షాపుల రద్దు వంటి హామీలపై చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. అధికారం కోసం హామీలిచ్చి.. సంతకాలు చేసి ప్రజలను ఏమార్చారే తప్ప వాటిని సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. వాస్తవానికి రూ.87 వేల కోట్లు ఉన్న పంట రుణాలను రూ.25 వేల కోట్లుగా చూపించి చివరకు రూ.7 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని గుర్తుచేశారు. డ్వాక్రా రుణాలు రద్దుచేయకపోగా మూలధనంలో పెట్టుబడిలో కొంత ఇచ్చినట్టు మభ్యపెట్టారని తెలిపారు. రూ.365 కోట్ల చేనేత రుణాల్లో రూ.110 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వం సొంతంగా నిర్వహించాల్సిన ఎన్టీఆర్ సుజలస్రవంతి మంచినీటి పథకాలను దాతలున్న చోట పెట్టి మిగిలినచోట్ల చేతులెత్తేసిందన్నారు.
మహిళలకు ఇచ్చిన మద్యనిషేధ హామీని అమలుచేయకుండా బెల్ట్‌షాపులను రెగ్యులరైజ్ చేసుకుని మద్యం ఆదాయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్లకు పెంచుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడబెరికే పనిలో పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అది కాదు 9 వేల మంది ఉన్నారని మాట మార్చి ఇప్పుడు కేవలం వెయ్యి మందిని రెగ్యులర్ చేయడం ప్రభుత్వం అవకాశ విధానానికి అద్దం పడుతోందని అన్నారు.
రాష్ట్రంలో అంగన్‌వాడీలకు పెంచిన జీతాలు, ఆశావర్కర్లు, కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు విదేశీ యానాలకు, రాజధాని ఆర్భాటపు ఖర్చులకు సొమ్ము ఎక్కడిదని వారు ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. విభజన హామీలను సాధించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా కార్మికులు కూడా పోరాడాలని మహాసభ తీర్మానించినట్టు చెప్పారు.
కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు ఉండేలా చట్టం తేవాలని, కోటి మందికిపైగా ఉన్న అసంఘటిత కార్మికులకు లెసైన్సులు ఇవ్వాలని, మూసివేసిన పరిశ్రమలను తెరిపించి వేలాది కార్మికులను ఆదుకోవాలని మహాసభ తీర్మానించినట్టు చెప్పారు. మున్సిపల్ కార్మికుల ఉపాధికి చేటు తెచ్చే జీవో నంబర్ 279 రద్దుచేయాలని, కార్మిక చట్టాల్లో సంస్కరణలు విరమించుకోవాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వాన్ని కోరుతూ పలు తీర్మానాలు చేసినట్టు ఉమామహేశ్వరరావు, ధనలక్ష్మి చెప్పారు.
వాగ్దానాల మాఫీ బాబు
Published Tue, Jun 28 2016 7:43 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement