సాక్షి ప్రతినిధి కడప: వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వర్గీయులు సైతం నేతలకు తగ్గట్లుగా వ్యవహరించేవారు. అధికారం కోసం ఛీ కొట్టిన పంచన చేరిన నేత ఒకరైతే. అవమానాలు భరిస్తూ నే అదే పార్టీలో కొనసాగుతోన్న నేత మరొకరు. పరస్పర విరుద్ధ వైఖరితో ఉన్న వారు కాంట్రాక్టు పనుల కోసం భాయి.. భాయి అంటూ పంపకాలు చేసుకున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింతలకు పాల్పడుతోన్న వైనమిది.
జమ్మలమడుగు నియోజకవర్గంలో కాంట్రాక్టు పనుల కోసం టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పరస్పర దాడులు చేసుకున్నారు. ఈక్రమంలో టీడీపీ పెద్దల జోక్యం అనివార్యమైంది. కాంట్రాక్టు పనులు పంపకాలు చేపట్టారు.
ఈ క్రమంలోనే జమ్మలమడుగు మున్సిపాలిటీలో డ్రైనేజీ, సీసీరోడ్లు, పైప్‌లైన్ మరమ్మత్తుల పేరుతో14 పనులకు టెండర్లకు పిలిచారు. రూ.1.56కోట్లతో చేపట్టిన ఈ పనులు ఇరువర్గాలకు పంపకాలు చేశారు. ఆమేరకు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ పేరుతో ఓవర్గం, ఎం.బాలపుల్లారెడ్డి పేరుతో మరో వర్గం ముందస్తుగా నిర్ణయించుకున్న పనులకు సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్లును ఆమోదించేందుకు మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చా లేకుండానే సమావేశానికి ముగింపు పలికారు. శ్రీనివాస ఇన్‌ప్రాస్టక్చర్ రూ.79 లక్షలు, ఎం.బాలపుల్లారెడ్డి రూ.77 లక్షల విలువ గల పనులకు మున్సిపల్ కౌన్సిల్ అమోదం తెలిపింది.
వర్గాలు వేరైనా విరుద్ధభావాలు వ్యక్తమైనా కాంట్రాక్టు పనులు కోసం ఏకం అవుతోన్న ఆ ఇరువురు నేతలు మరోవైపు గ్రామస్థాయిలో ఆధిపత్యం కోసం ఆరాటం ప్రదర్శిస్తున్నారు. ఈక్రమంలోనే చిన్నకొమెర్ల ఘటన ఇటీవల తెరపైకి వచ్చింది. అదే కోవలోనే చిన్నదుద్యాల, పెద్దదండ్లూరు, శిరిగేపల్లె, కొండాపురం ఘటనలు తలెత్తాయి. ఆదాయం కోసం అంతర్గత ఒప్పందాల మేరకు పనులు పంచుకోనే నేతలు, గ్రామాలల్లో ఘర్షణలను కూడా నియంత్రించాల్సిన నైతిక బాధ్యత ఉందని పలువురు అభిప్రాయ పడుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment