కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నియమితులయ్యూరు. ఈ విషయూన్ని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్వయంగా పాపిరెడ్డికి ఫోన్ చేసి తెలియజేశారు. ఉన్నత విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఫోన్ చేసి.. హైదరాబాద్‌కు రావాలని చెప్పడంతో పాపిరెడ్డి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.
కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన తమ్మల పాపిరెడ్డి ప్రొఫెసర్‌గా ఎదిగి వివిధ పదవులు నిర్వర్తించి ఈ ఏడాది జూన్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ప్రొఫెసర్‌గా ఉంటూనే 2009 సంవత్సరం నుంచి జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోశించారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు పాపిరెడ్డి కేసీఆర్‌తో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ ప్రభుత్వంలో ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని పాపిరెడ్డి చెప్పుకుంటూవచ్చారు. ప్రస్తుతం ఉన్నత విద్యలో సంస్కరణలు చేయాలనే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇందుకు రిటైర్డ్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే పాపిరెడ్డికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా అవకాశం కల్పించారని భావిస్తున్నారు.
ఎన్నో పదవులు..
ఆదిలాబాద్ జిల్లా జయపూర్ మండలం పవనూర్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పాపిరెడ్డి చదువు నిమిత్తం హన్మకొండకు వచ్చి స్థిపరడ్డారు. ఆయన సతీమణి శోభ హన్మకొండ మండలంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. పాపిరెడ్డి 1975లో ఓయూలో బీఏ, కాకతీయ యూనివర్సిటీలో 1977లో ఎంఏ ఎకనామిక్స్, 1980లో ఎంఫీల్ పూర్తిచేశారు. 1981లో హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. కేయూలోనే 1988లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగం అధిపతిగా 2004నుంచి 2006వరకు, బోర్డు ఆఫ్ చైర్‌పర్సన్‌గా 2006 నుంచి 2008 వరకు, పరీక్షల నియంత్రణాధికారిగా 2006 నుంచి 2009 వరకు, కేయూ ఇం చార్జి రిజిస్ట్రార్‌గా 2002 నుంచి 2003 వరకు పనిచేశారు.
ఆయన పర్యవేక్షణలో 8మంది పీహెచ్‌డీలు, 8 మంది ఎంఫిల్ పూర్తిచేశారు. ఐదు పుస్తకాలు, 13 జర్నల్స్‌ను ప్రచురించా రు. 15 పరిశోధనాపత్రాలను వివిధ సదస్సు ల్లో సమర్పించారు. నాలుగు మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టులు, రెండు మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ లేబర్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ అగ్రికల్చరల్ ఎకనామిక్ అసోసియేషన్, న్యూడిల్లీలోని ఇండియన్ ఇని స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పొలిటికల్ ఎకనామి అసోసియేషన్ లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్‌ను కలిగి ఉన్నారు.
వివక్షపై ఆనాడే నిరసన..
కాకతీయ యూనివర్సిటీలో పాపిరెడ్డి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా రెండు సార్లు, జనరల్ సెక్రటరీగా రెండుసార్లు పనిచేశారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారంతోపాటు సామాజిక సమస్యలపై కూడా స్పందించేవారు. తెలంగాణ ప్రాంతం వారిపై ఉన్న వివక్షపై ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కృష్ణమూర్తితో కలిసి 1986 నవంబర్ 1న విద్రోహ దినం పాటించి నిరసన తెలిపారు. 1994లో ఓయూ ప్రొఫెసర్ వైకుంఠంను కేయూ వీసీగా నియామకం చేశారు. వైకుంఠం నిర్ణయాలను పాపిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
జాక్‌ై చెర్మన్‌గా..
తెలంగాణ మలి దశ పోరాటంలో కేయూ విద్యార్థుల పాత్ర మరువలేనిది. ఇందులో ఉద్యోగులు, అధ్యాపకులు సకలజనుల సమ్మెతో భాగస్వాములుయ్యారు. ఈ దశలో పాపిరెడ్డి 2009 నుంచి తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్‌గా నియమించబడ్డారు. జాక్ చైర్మన్‌గా జిల్లాలో అనేక ఉద్యమాలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు.
అధ్యాపకుల, విద్యార్థుల హర్షం
ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన పాపిరెడ్డికి మంగళవారం పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ సారంగపాణి, జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, బాధ్యులు డాక్టర్ వెంకయ్య, షాయెదా, సురేఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు కొండల్‌రెడ్డి, కృష్ణమాచార్య, ఎన్‌జీవో సంఘం బాధ్యులు పుల్లాశ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్లు డాక్టర్ సాదురాజేశ్, ఫిరోజ్, రాజు, కరుణాకర్, అంజన్‌రావు, ప్రొఫెసర్లు సీతారామరావు, ఎ.సదానందం, రాజేషం, మోహన్‌రెడ్డి పూల బోకేలను అందించి అభినందించారు. పాపిరెడి.. తన తల్లి సరోజతోను, సతీమణి శోభతోను తన సంతోషాన్ని పంచుకున్నారు.
విద్యార్థులు ఆందోళన చెందవద్దు
ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలోనే చేపట్టేలా కృషిచేస్తానని, తెలంగాణ వి ద్యార్థులు ఆందోళన చెందవద్దని పాపిరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. వీసీల నియూమకాలను త్వరగా చేపట్టేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తనపై నమ్మకంతో రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యమ నేతకు ఉన్నత పదవి
Published Wed, Aug 6 2014 3:31 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement