హంద్రీనీవా పనుల పరిశీలన
బంగారుపాళెంలో నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సీఎం మదనపల్లెకు చేరుకుంటారు. సమీపంలో జరుగుతున్న హంద్రీ-నీవా రెండోదశ పనులను పరిశీలిస్తారు. అక్కడనుంచి బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా కుప్పం బ్రాంచి కెనాల్ పనులను వీక్షిస్తారు. అక్కడి నుంచి బంగారుపాళెం చేరుకుని నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు. ఈ పర్యటనను అధికారికంగా ఖరారు చేయాల్సింది. ఇదిలా ఉండగా సీఎం రాకను దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్ల పరిశీలనకోసం జిల్లా కలెక్టర్ మదనపల్లెకు గురువారం రానున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
పనుల వేగవంతానికి తంటాలు
హంద్రీ-నీవా పనుల పరిశీలనకు సీఎం వస్తున్న నేపథ్యంలో టన్నెల్ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ బూమర్ చెడిపోవడంతో మాన్యవల్ పద్ధతిలో పనులు సాగుతున్నాయి. సీఎం వచ్చే నాటికి బూమర్లు తెప్పించి. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువు మేనెలలోపు పనులను పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
కుప్పం బ్రాంచి కెనాల్‌కు అడ్డంకి
కుప్పం బ్రాంచి కెనాల్ పనులను వేగవంతంగా చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 130 కిలోమీటర్ల కాలువకు సంబంధించి 50 కిలోమీటర్లలో కాలువ పనులు జరుగుతున్నాయి. అయితే సీఎం ఇలాకాలోని శాంతిపురం మండలంలో అడగకుండానే అధికారులు తమ పొలాల్లో కొలతలు వేస్తున్నారని 20 కేసులు హైకోర్టులో నమోదు చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయడం కష్టమని నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి రైతులతో చర్చించి ఉంటే సమస్య కోర్టు వరకు వెళ్లేది కాదని స్థానిక ప్రజల్లో చర్చ సాగుతోంది.