ఈ చిత్రంలో కనిపిస్తున్న టెంటుపై ‘అన్న క్యాంటిన్’ బ్యానర్ ఉందని ఆశ్చర్యపోవద్దు. ఇది నిజంగా అన్న క్యాంటీనే... అయితే నగరాల్లో, పట్టణాల్లో మాదిరిగా అధునాతన హంగులతో నిర్మించిన భవనం ఎందుకు లేదా.. అని మీకు అనుమానం రావొచ్చు. ఆగండాగండీ.. అక్కడకే వస్తున్నా. సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడానికి టెక్కలిలో ఇలా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు చేసిన ఎత్తుగడ ఇదండీ...
సాక్షి, శ్రీకాకుళం: ‘ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లలో భోజనం, ఫలహారం.. అందమైన భవనాల్లో వీటిని నడుపుతున్నాం..’ అంటూ తరచూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు వాటిని చెట్లకింద నడిపే స్థాయికి తెచ్చారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓట్లను ఆకర్షించడానికి మేజర్ పంచాయతీల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఎత్తుగడ వేశారు. తొలుత గతేడాది జులైలో రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో 195 చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ కోసం రూ. లక్షలు వెచ్చించి రంగు, హంగుల భవనాలు నిర్మించారు. వీటిలో ఉదయం ఫలహారం (ఇడ్లీ/పూరీ), మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డిస్తున్నారు. ఈ బాధ్యతను హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్‌కు అప్పగించారు.
సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉండేలా 152 మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందంటూ తొందర పెడుతూ ఫిబ్రవరిలోనే వీటిని ప్రారంభించాలన్నారు. వీటికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయా చోట్ల రెయిన్ ప్రూఫ్ పగోడాలు (టార్పాలిన్ టెంట్లు), మూడు వైపులా కవర్ చేసే సైడ్‌వాల్స్, నాలుగు డైనింగ్ టేబుళ్లు, నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు, మూడు సింక్‌లు, ప్లాస్టిక్ డస్ట్‌బిన్లు, ఒక బీరువా, అన్న క్యాంటీన్ బ్యానర్ వంటివి సమకూర్చాలని నిర్దేశించారు. వీటికి అవసరమైన నిధులు మాత్రం సమకూర్చలేదు.
వీటి నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చెట్ల కింద, టెంట్లు, పాడుబడిన భవనాలనే అన్న క్యాంటీన్లుగా మార్చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 152 మేజర్ పంచాయతీలకుగాను 43 చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పటికే నడుస్తున్న క్యాంటీన్లు మూడు పూటలా అందుబాటులో ఉండగా, కొత్తగా గ్రామీణ ప్రాంతాల క్యాంటీన్లలో మధ్యాహ్నం మాత్రమే భోజనం పెడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక భవనంలో వీటిని నడుపుతుండగా, పల్లెల్లో మాత్రం చెట్లు, శిథిల భవనాలే దిక్కయ్యాయి. భోజనం తప్ప ఇంకేమీ అందుబాటులో లేని దుస్థితిపై అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమలాంటి ఓట్లు కొల్లగొట్టాలన్న ఆలోచనతోనే చంద్రబాబు మొక్కుబడి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యమే..
ఇక ఆహారం సరఫరా చేసినందు కు హరేకృష్ణ మూమెంట్ ఫౌండేషన్‌కు నెలకు రూ.5 నుంచి రూ. 6 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటోంది. ఆరంభంలో కొన్ని నెలలు బిల్లులు చెల్లించలేదు. ఇలాగైతే తమవల్ల కాదంటూ ఒత్తిడి చేయడంతో జనవరి వరకు బకాయిలు చెల్లించారు. అప్పట్నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది.
ఓట్ల కోసమే..
ఎన్నికల ముందు పల్లెల్లో ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు మేజర్ పంచాయతీల్లో హడావుడిగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఏమాత్రం సదుపాయాల్లేని టెంట్లలో మొక్కుబడిగా ఒంటిపూట భోజనం పెడుతున్నారు. కనీసం కుర్చీలూ లేవు.
– డీ కుసుడు, టెక్కలి మండలం
చెట్ల కింద కూర్చుని తింటున్నాం
అన్న క్యాంటీన్లను పెడుతున్నామని హడావుడి చేశారు. తీరా చెట్ల కింద, శిథిల భవనాల్లో పెట్టా రు. దీంతో చెట్ల కింద భోజనం చేయాల్సి వస్తోంది. కనీస సదుపాయాలు కల్పించకుం డా ఇలా ఏర్పాటు చేయడం తగదు.
– వెంపటపు కార్తీక్, పొందూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment