సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ‘తక్కువ ధరకే అన్న క్యాంటీన్‌లో భోజనాలు దొరుకుతున్నాయి. పదార్థాలు రుచిగా ఉన్నాయా తమ్ముళ్లూ...’ అంటూ పెద్దసారు అడిగే సరికి అనుంగు సోదరులకు నోరు మెదల్లేదు. ఓరే.. మనకు తెలీకుండా ఇచ్చాపురంలో క్యాంటీన్ ఎప్పడు పెట్టార్రా.. గుంపులో ఉన్న కామేశం మెల్లగా బావ వెంకటేసు చెవిలో గుసగుసలాడాడు.. ‘ఆ ఒక్కటీ అడక్కు..’ ఇంకా మెల్లగా అన్నాడు వెంకటేసు..
తమ్ముళ్లూ.. మనం చేసిన అభివృద్ధి చూసి ప్రధాన మంత్రి కూడా ఓర్వలేకపోతున్నాడు. అనుమానం ఉంటే ఆయన పనులన్నీ మానుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడమనండి.. పెద్దసారు చిన్న మైకులో చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు..పెదాన మంతిరి ఎందుకొచ్చి మాట్లాడతారు బావా.. ఆయనకిదే పనా.. బుర్ర గోక్కుంటూ అనుమానం వ్యక్తం చేశాడు. కామేశు.. ‘ఆ ఒక్కటీ అడక్కు..’ మళ్లీ అదే సమాధానం చెప్పాడు. వెంకటేసు..
‘తుఫాన్‌కు ఇల్లు పడిపోయాయి. చెట్లు కూలిపోయాయి. ఉద్దానం నాశనమైపోయింది.. అయినా నా అనుభవం ముందు తుఫాన్ ఓడిపోయింది కదా తమ్ముళ్లూ.. మనం కట్టించిన ఇళ్లలో బాధితులు హాయిగా ఉన్నారు..’ అవునా కాదా తమ్మళ్లూ.. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పాలి.. అంటూ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటుని మురిసిపోతున్నారు పెద్దసారు. పోనీ ఇదైనా సెప్పు బావా.. ఇల్లు పడిపోయినాయి నిజమే.. కొత్తిల్లు ఎక్కడ కట్టిచ్చారు.. డబ్బులు కూడా ఒకిరికి ఏసారు.. మన జెండా కాకపోతే ఎయ్యనేదు.. మరి కొత్తిల్లు అంతారేటి.. కామేశంకు ఏమీ అర్థం కావడం లేదు. ‘ఆ ఒక్కటీ అడక్కు..’ వెంకటేసు ఏ మాత్రం తడబాటు లేకుండా అదే మాట మీద నిలబడ్డాడు..
పెద్దసారు ఇంకాస్త గొంతు పెంచి స్పీచ్ దంచేస్తున్నారు.. అమరావతిని సింగపూర్ చేస్తా.. వాళ్లు ఒప్పుకోకపోతే చైనా చేస్తా.. వాళ్లు గొడవపెడితే అమెరికా చేస్తా.. వారు కూడా ఏదైనా అంటే కిమ్‌తో మాట్లాడి ఉత్తర కొరియా చేసేస్తా.. అక్కడ ఒలింపిక్స్ పెడతా.. ఒలింపిక్స్‌లో మన ఆటలే ఆడిస్తా.. ఏకధాటిగా చెప్పుకుంటూ పోతున్నారు. ఓరే.. ఆయన్ను ఆపండ్రా.. ఎలా కనిపిత్తన్నార్రా జనాలు.. ముందు పర్మినెంట్‌గా ఒక్క ఇటుకైనా ఎయ్యమని ఆయనకు సెప్పండి అన్నాడు కామేశం. ఆయన సెప్పింది ఇనడమే.. సెప్పడమనే ఆప్షను లేదు బావా.. మాకిది అలవాటే. అబ్బ మొదటిసారి ఇంకో మాట మాట్లాడాడు వెంకటేసు..
సోంపేటలో కిడ్నీ ఆస్పత్రి పెడతా.. తాగునీరు రప్పిస్తా.. పెన్షన్లు పెంచుతా.. హామీల వర్షం కురిపిస్తున్నారు పెద్దసారు. ఐదేళ్లు కుర్సీలో ఉండగా గుర్తురాని పనులు.. ఎలచ్చన్లు రాగానే గుర్తుకొచ్చేత్తన్నాయి.. అవునా బావా.. అప్పటికే మీటింగ్‌పై ఇంటరెస్టు పోయి అదోలా మారిపోయిన కామేశం నోటి నుంచి యథాలాపంగా మాటలు వచ్చేశాయి. ‘ఆ ఒక్కటీ అడక్కు’ వెంకటేసు మళ్లీ మొదటి మాటెత్తుకున్నాడు..
ఆ మాట విని కామేశంకు మండిపోయి మీటింగ్ నుంచి ఒకే పరుగు అందుకున్నాడు. బావా.. ఎల్లిపోతావేటి.. ఓటు మాత్రం మనకే ఎయ్యాల.. అంటూ వెంకటేసు గట్టిగా అరిచారు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు కామేశం.
ఆ ఒక్కటీ అడక్కు!
Published Mon, Apr 1 2019 12:42 PM | Last Updated on Mon, Apr 1 2019 12:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment