వైఎస్‌ జగన్: ‘నేతన్న నేస్తం’ ప్రారంభించిన సీఎం | YS Jagan Launched YSR Netanna Nestam Scheme in Dharmavaram - Sakshi
Sakshi News home page

‘నేతన్న నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్‌

Published Sat, Dec 21 2019 1:33 PM | Last Updated on Sat, Dec 21 2019 3:58 PM

CM Jagan Launched Netanna Nestam Scheme - Sakshi

సాక్షి, ధర్మవరం: ప్రతి చేనేత కార్మికుడికి మంచి జరిగే విధంగా ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని శనివారం  సీఎం ప్రారంభించారు. తన పుట్టిన రోజున నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మవరంలో నేతన్నల కష్టాలు తన కన్నా బాగా ఎవరికీ తెలీదన్నారు. నేతన్నలకు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. అగ్గిపెట్టేలో పట్టే చీర దగ్గర నుంచి స్వాతంత్రోద్యమం వరకు నేతన్నలకు ఒక చరిత్ర ఉందన్నారు. ధర్మవరం చేనేతల గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. చేనేతల ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదన్నారు. చేనేత కుటుంబాలు పేదరికం, అప్పుల బాధతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆప్కో పేరుతో దోచుకుందని, దీనిపై దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు.



‘పాదయాత్రలో  చేనేతల కష్టాన్ని చూశాను.. బాధను విన్నాను. నేను ఉన్నానని చెప్పి ఆ రోజు అందరికి చెప్పానన్నారు. చెప్పిన మాట ప్రకారం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఆ మాటను నిలబెట్టుకుంటూ వైఎస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ఇదే ధర్మవరంలో ప్రారంభిస్తున్నాను. రాష్ట్రంలో దాదాపు 85 వేల కుటుంబాలకు ఈ సాయాన్ని విడుదల చేయబోతున్నాం. చేనేత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. సొమ్మును మీరు చేసిన పాత అప్పులకు బ్యాంకు వాళ్లు జమ చేసుకోకుండా వారితో కూడా మాట్లాడటం జరిగిందని సీఎం జగన్‌ అన్నారు.

ఉగాది లోగా 25  లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు
ఐదేళ్లలో ప్రతి చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు నేరుగా అందిస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ.3.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్టు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ‘నవరత్నాలు’ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఉగాది లోగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలకు ఇస్తామన్నారు. జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15వేలు సాయం అందజేస్తామన్నారు. వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం చేశామన్నారు. ఐదేళ్లుగా న్యాయం జరగని అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసా కల్పించామన్నారు. మత్స్యకారులకు మునుపెన్నడూ లేనివిధంగా సహాయం చేస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.

నా బలం.. ప్రజల ఆశీస్సులు, దేవుడి అండ..
సామాజిక పెన్షన్ల కోసం గత ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు నెలకు రూ.1500 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. అవ్వా-తాతలకు భరోసా​ కల్పించామని.. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తెచ్చామన్నారు. గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. శాశ్వత ప్రతిపాదికన బీసీ కమిషనర్‌ ఏర్పాటు చేశామన్నారు. కేబినెట్‌లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం కల్పించామన్నారు. మారుమూల గ్రామాలకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అవినీతి లేకుండా కాంట్రాక్టులు ఇస్తున్నామన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేస్తున్నారో చూస్తున్నామని.. తన బలం ప్రజల ఆశీస్సులు, దేవుడి అండ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement