CM YS Jagan Fires On Opposition Party Leaders At Venkatagiri Public Meeting - Sakshi
Sakshi News home page

ఇదీ వీళ్ల సంస్కారం: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్‌

Published Sat, Jul 22 2023 1:57 AM | Last Updated on Sat, Jul 22 2023 11:46 AM

CM Jagan Fires On Opposition Party Leaders At Venkatagiri Meeting - Sakshi

వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న బాధతో, భవిష్యత్‌పై కలత చెందిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వీరంతా సంస్కార హీనులని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వెంకటగిరిలో జరిగిన సభలో జగన్‌ ఏమన్నారంటే..  

బాబుగారి వలంటీర్‌ ఈ దత్తపుత్రుడు.. మన వలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారంటాడా? ఇతను ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకుని వారిని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం.. మరలా వదిలేయడం.. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్లీ వదిలేయడం.. మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం.. ఇదే పని. పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడతాడు. 

మరో క్యారెక్టర్‌ వయస్సు 75 ఏళ్లు. అయినా సిగ్గులేదు. టీవీల్లోకి వచ్చి ఒక షోలో మాట్లాడుతూ.. ఆహా బావా.. నువ్వు సినిమాల్లోనే చేశావు. నేను నిజ జీవితంలోనే చేశాను అంటూ.. చేసిన వెధవ పనులను ఆ ముసలాయన గొప్పగా చెప్పుకుంటాడు.  

అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంట.. లేదా కడుపన్నా చేయాలంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు.

పట్టపగలే మందు తాగుతూ పదిమంది అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే డ్యాన్స్‌లు చేసేవారు ఇంకొకరు. యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే.. నిస్సిగ్గుగా డ్యాన్స్‌లు చేస్తూ కనిపిస్తాడు.

సాక్షి, తిరుపతి: వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న బాధతో, భవిష్యత్‌పై కలత చెందిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వీరంతా సంస్కార హీనులని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎండైనా, వానైనా, చలైనా, వరదలొచ్చినా, పండగరోజైనా, సెలవు­రోజైనా నిక్కచ్చిగా సేవ చేస్తున్న వలంటీర్ల కేరెక్టర్‌­పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు, బావమరిది కేరెక్టర్‌ ఏంటో ప్రజలకు బాగా తెలుసన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఆయన వైఎస్సార్‌ నేతన్న నేస్తం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ప్రజలనుద్దే­శించి మాట్లాడారు. కొన్ని విషయాలు మాట్లాడకూ­డ­­ద­నుకున్నా పరిస్థితులు చూసినప్పుడు తప్పడం లేదన్నారు.

ఎక్కడైనా మంచి చేస్తున్న వ్యవస్థలను, మనుషుల్ని సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ అవమానించరని, కానీ మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి ఇటీవల సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందు వల్ల ఈ మాటలు చెప్పాల్సి వస్తోందని చెప్పారు. వలంటీర్లంతా మన ఊళ్లో, మన కళ్లెదుటే నాలుగేళ్లుగా కనిపిస్తున్నారని, మనందరికీ తెలిసినవాళ్లేనన్నారు. ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో తలుపుతట్టి, గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ ఇదిగో మీ పెన్షన్‌ అంటూ అవ్వాతాతలను చిరునవ్వులతో పలరించే కుటుంబ సభ్యులు మన వలంటీర్లు అని చెప్పారు.


వెంకటగిరిలో జరిగిన సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం

అవినీతికి, వివక్షకు తావు లేకుండా, మనందరి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడప వద్దకూ.. కాళ్లకు బలపం కట్టుకుని మరీ వెళ్లి.. కులం, మతం, వర్గం, ప్రాంతం చివరకు వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా అవ్వాతాతలకు మేలు చేస్తున్న మనవళ్లు, మనవరాళ్ల వ్యవస్థపై కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్‌ ఈనాడు రామోజీరావుది అయితే నిర్మాత చంద్రబాబు.. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి అని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 

నిస్సిగ్గు రాతలు 
► వలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటారు. గ్రామ వలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నారు.. ముంబయికో, ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారు అని ఇంకొకరు నిస్సిగ్గుగా అంటారు. దీన్ని తాటి­కాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక, సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకో సిగ్గులేని టీవీ–5 మీడియా రాస్తాయి. ఇటువంటి వారంతా బురద జల్లుతారు. అబద్దాలకు రెక్కలు తొడుగుతారు. 

► 2.60 లక్షల మంది మన పిల్లలు గ్రామ స్థాయిలో సేవలందిస్తున్నారు. ఇందులో 60 శాతం నా చెల్లెమ్మలే. మన వలంటీర్లు అంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే. వీరంతా సేవా భావంతో పని చేస్తున్నారు. ఇలాంటి మన సేవామిత్రలు, సేవారత్నాలు, సేవా వజ్రాలు అయిన మన వలంటీర్ల కేరెక్టర్‌ను తప్పుపట్టింది ఎవరో తెలుసా? 


సభా ప్రాంగణం నిండిపోవడంతో బయట వేచి ఉన్న జనవాహిని


► ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్‌. ఇంకొకరు చంద్రబాబు నాయుడు. మరొకరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీరంతా ఒక గజదొంగల ముఠా. వీళ్లు వలంటీర్ల కేరెక్టర్‌ గురించి మాట్లాడుతున్నారు. వలంటీర్‌ పిల్లల కేరెక్టర్‌ ఎలాంటిదో అదే గ్రామంలో వారి సేవలందుకుంటున్న కోట్ల మందికి తెలుసు.

వీరికి మంచి చేసిన చరిత్రే లేదు 
► ఇచ్చేది తన పార్టీ బీ–ఫారమ్‌. నిజానికి టీడీపీకి బీ–టీమ్‌. చంద్రబాబు మీద పోటీ ఒక డ్రామా. బీజేపీతో స్నేహం మరో డ్రామా. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. అంతటికీ స్క్రిప్ట్‌ ఈనాడు రామోజీరావుది. నిర్మాత చంద్రబాబు. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్త­పుత్రుడివి. ఇవీ నిజాలు.

► ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారంటే వీరికి మంచి చేసిన చరిత్ర లేదు. ఫలానా మంచి చేశాం.. అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకోవడానికి కూడా ఒక్కటంటే ఒక్కటి మంచి చేసిన చరిత్ర లేదు. ఉన్నదంతా వంచన, వెన్నుపోట్లు మాత్రమే. ఇదీ వీళ్ల జీవిత చరిత్ర.

ఇదీ మన చరిత్ర 
► మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం కేవలం 50 నెలల్లోనే ఎలాంటి అవినీతి, లంచాలకు తావులేకుండా ఏకంగా రూ.2.25 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి నా అక్క­చెల్లెమ్మల అకౌంట్లలో జమ చేసింది. 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం మన చరిత్ర. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం మన చరిత్ర. ప్రతి ఏటా 44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. 84 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.26 వేల కోట్లకు పైగా అమ్మఒడి పథకం ద్వారా నిలవడం మన చరిత్ర. 

► దాదాపు కోటి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరాగా.. వారికి తోడుగా నిలబడుతూ రూ.19,178 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టడం, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇవ్వడం మీ బిడ్డ చరిత్ర.

► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేయూత అనే పథకం ద్వారా మరో రూ.14,129 కోట్లు ఇచ్చాం. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేటట్టుగా వ్యాపారాలు సైతం చూపించడం ఇంకో చరిత్ర. రైతు భరోసాగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైచిలుకు రైతన్నలకు రూ.31 వేల కోట్లు నేరుగా జమ చేయడం మన చరిత్ర.

గొప్ప చదువుల కోసం తాపత్రయం
► మన పిల్లలు చదవాలి, చదువుల కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఏ తల్లి, తండ్రీ తమ పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకూ­డదని.. వారికి తోడుగా ఉంటూ విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చాం. పిల్లలకు మెస్‌ చార్జీలకు.. బోర్డింగ్, లాడ్జింగ్‌ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం తీసుకొచ్చాం. ఈ రెండు పథకాలకు ఈ 50 నెలల్లో రూ.15 వేల కోట్లు ఇచ్చాం. 

► మన పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య, నాడు–­నేడుతో రూపురేఖలు మారుతున్న స్కూళ్లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్, మూడో తరగతి నుంచే టోఫెల్‌లో సైతం ప్రిపరే­షన్, ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ఉండేలా ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్‌ చేయడం, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, రోజు­కొక మెనూతో పిల్లలకు గోరుముద్ద పథకాన్ని తీసుకురావడం, స్కూళ్లు తెరిచేటప్ప­టికే ఆ పిల్లల చిక్కటి చిరునవ్వుల మధ్య కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా విద్యా కానుక పంపిణీ.. ఇది మన పిల్లల భవిష్యత్‌ కోసం చేస్తున్న మన చరిత్ర.

ఇంటింటికీ ధైర్యంగా వెళ్తున్నాం
►  మేనిఫెస్టో అంటే చంద్రబాబు మాదిరిగా చెత్తబుట్టలో పడేయడం కాదు. దాన్నొక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాం. ఏకంగా 98 శాతం హామీలను నెరవేర్చి.. గడప గడపకూ తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఈ మేనిఫెస్టోను వాళ్ల చేతుల్లో పెడుతూ మీరే చదివి మీ బిడ్డని ఆశీర్వదించండని అడుగు­తున్న చరిత్ర మనది. 


► ఏకంగా 26 జిల్లాలు చేసిన చరిత్ర మనది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంతవరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ హయంలో ఏకంగా 50 శాతం పెరిగి 6 లక్షలకు చేరాయి. 2.06 లక్షల ప్రభుత్వ ఉద్యో­గాలిచ్చిన చరిత్ర మన­ది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ఉద్యో­గు­లను ఆదుకున్న చరిత్ర కూడా మన­దే.

► స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే.. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మరో 17 కడుతు­న్నాం. రాష్ట్రంలో నాలుగు చోట్ల ఆరు పోర్టు­లుంటే.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మరో 4 పోర్టులు కడుతున్నాం. 10 ఫిషింగ్‌ హార్బర్లు, మరో 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పేదలపట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో చేస్తున్నాం.

మారుతున్న గ్రామాల ముఖచిత్రం
►  ప్రతి గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలో వలంటీర్లు కనిపిస్తారు. సెక్రటేరియట్‌ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ కనిపిస్తుంది. ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లూ కనిపిస్తాయి. 

► కొత్తగా 108, 104 అంబులెన్స్‌ వాహనాలు 1,600 పైచిలుకు కుయ్‌ కుయ్‌మంటూ వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారాయి. గతంలో సరిగా నిర్వహించకుండా.. కేవలం 1,000 వ్యాధులకు పరిమితమైన ఆరోగ్యశ్రీని.. 3,250 వ్యాధులకు విస్తరించాం. ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చాం. కోవిడ్‌ టైంలో మనం చేసిన యుద్ధం ఇంకొక చరిత్ర. 

► అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా మహిళా సాధికారత విషయంలో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా చేశాం. సామాజిక న్యాయంలో ఎవరూ చేయని విధంగా ప్రతి అడుగులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 50 శాతం నామినేటెడ్‌ పదవులు, 50 శాతం నామినేషన్‌ మీద ఇచ్చే కాంట్రాక్టుల కోసం ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న చరిత్ర మనది.

► రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా అసైన్డ్‌ భూములు మీద హక్కులు ఇచ్చిన చరిత్ర మనది. 2 లక్షల ఎకరాలకు పైగా చుక్కల భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే.. భూముల సమస్యలను తొలగించి రైతన్నల చేతిలో పెట్టిన చరిత్ర మనది.

అప్పటికీ, ఇప్పటికీ తేడా చూడండి 
► మనిషి కేరెక్టర్, విశ్వసనీయత విషయంలో కానీ, మేనిఫెస్టోకి ఇస్తున్న విలువ గురించి కానీ, చేస్తున్న మంచి విషయంలో కానీ గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా మీరే గమనించండి. మనకు ఎలాంటి పాలకుడు, పాలన కావాలన్నది ఆలోచన చేయండి. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. మీ బిడ్డ దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు.

రాబోయే రోజుల్లో వాళ్లు ఇంకా అబద్ధాలు చెబుతారు. ఇవాళ వలంటీర్ల గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో.. రాబోయే రోజుల్లో మీ బిడ్డ గురించి, మీ బిడ్డ ప్రభుత్వం గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి అదే మాదిరిగా దారుణంగా అబద్ధాలు చెప్తారు. ఇవేవీ నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. 


సభా ప్రాంగణానికి సీఎం జగన్‌ వస్తుండగా జై జగన్‌ అంటూ నినాదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement