
పుట్టిన రోజు సందర్భంగా పుష్పశ్రీవాణి దంపతులను సన్మానిస్తున్న పార్టీ నేతలు
సాక్షి, విశాఖపట్నం : గిరిజన మహిళనైన తనను ఉప ముఖ్యమంత్రిని చేసి యావత్ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో పుష్పశ్రీవాణి పుట్టినరోజు వేడుకలు పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతూ.. చిన్నవయసులోనే తనకు పెద్దపదవి అప్పగించి గిరిజన మహిళలు, ప్రజల పట్ల అత్యున్నత గౌరవాన్ని చూపించిన తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మేనిఫెస్టో అంటే ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వపాలన ఉంటుందని పేర్కొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు
రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలన్నారు. రైతుబాంధవుడిగా చెరగని ముద్రవేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ‘రైతు భరోసో’ పేరుతో అత్యున్నత సంక్షేమ పథకం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని తెలిపారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద అర్హులైన రైతులకు రూ.12,500 జమ చేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు వారాలు కాకుండానే పదికి పైగా సంక్షేమ పథకాలు అమలుచేశారని కొనియాడారు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు 600 పైగా హామీలిచ్చి ఒక్క హామీకూడా పూర్తిగా అమలు చేసిన పాపానపోలేదన్నారు. అందుకే ప్రజలు టీడీపీనీ భూస్థాపితం చేశారని, మరో 25 ఏళ్ల పాటు టీడీపీ మనుగడే ఉండదని జోస్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీని వాస్ మాట్లాడుతూ మహిళలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శులు సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, నడిపల్లి కృష్ణంరాజు, పేర్లవిజయచందర్, మొల్లి అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం అధికారప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు కొండారాజీవ్ పాల్గొన్నారు.