కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి : ‘పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. వారు నాకోసం ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలు భరించారు. వారికి ఎప్పటికీ అన్యాయం చేయను, జగన్ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు... దటీజ్ జగన్...’ అని కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నట్లు తెలిసింది. శాసనమండలి రద్దుపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది.
‘ప్రజా మద్దతుతో ఎన్నికైన మన ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం బిల్లుల్ని రూపొందించి శాసనమండలికి పంపితే అక్కడ అడ్డుకుంటున్నారు. సుభాష్ చంద్రబోస్, వెంకటరమణారావు ఇద్దరూ పదవులు కోల్పోతున్నందుకు నేను బాధ పడుతున్నాను. అయితే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు’ అని భేటీలో సీఎం పేర్కొనట్లు తెలిసింది. ఇదే సందర్భంలో ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లలో మండలికి సంబంధించిన వార్తా కథనాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనం ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నట్లు.. ఫిరాయిస్తే ఒక్కొక్కరికి ఐదారు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు అనుచిత కథనాలు ప్రచారం చేస్తున్నాయి.
నిరాధారమైన ఇలాంటి వార్తలు, కథనాలు ప్రచురిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయి’ అని మంత్రివర్గ సహచరులతో ప్రస్తావించారు. మనం అనుమతిస్తే పది మందికిపైగా ఎమ్మెల్సీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఓ మంత్రి చెప్పగా.. ముఖ్యమంత్రి జగన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అలాంటి పనిచేస్తే... ఇక మనకూ చంద్రబాబుకూ తేడా ఏముంటుందని అన్నట్లు సమాచారం. రాజకీయాల్లో అందుకు తాను పూర్తి విరుద్ధమని.. అలాంటి అనైతిక చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే శాసనమండలి రద్దు నిర్ణయానికి వచ్చామని చెబుతూ రద్దు నిర్ణయాన్ని ప్రతిపాదించారు. అందుకు మంత్రిమండలి సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థిస్తూ ఆమోదం తెలిపారు. 35 నిమిషాల సేపు జరిగిన ఈ సమావేశంలో మండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులను మంత్రివర్గ సహచరులకు జగన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment