
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల్లో నిత్యావసరాలు దొరకడం లేదనే ఆందోళన లేకుండా చేయడానికి, అదే సమయంలో సామాజిక దూరం పాటించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిత్యావసరాల కోసం వస్తున్న ప్రజలు ఒకే సమయంలో గుమిగూడటం వల్ల సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశం దెబ్బ తింటుందనే విషయంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సీఎం ఆదేశాలు ఇలా..
► నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలి. ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలి.
► కూరగాయలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలి. అంత వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం
1 గంట వరకూ అనుమతించాలి.
► సప్లై చెయిన్ దెబ్బ తినకుండా గూడ్స్ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలి.
► నిత్యావసరాల షాపుల వద్ద ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్ ఉండాలి.
► ప్రజలు నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలి. ఎవరూ కూడా 2 లేదా 3 కి.మీ పరిధి దాటి రాకూడదు. ఆ మేరకు అందుబాటులో ఉండేలా అధికార యంత్రాంగం చూసుకోవాలి. పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి.
► ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి
► కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలి. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే 1902కు కాల్ చేయాలి.
► కాల్ సెంటర్‌లో ఒక సీనియర్ అధికారిని పెట్టండి. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోండి. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ప్రకటించండి.
► నిల్వ చేయలేని పంట ఉత్పత్తుల విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
► ప్రజలకు నిత్యావసరాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment