జూన్ మాసం వరకు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చాం. లబ్ధిదారులను గుర్తించడానికి, అప్‌డేషన్ చేయడానికి వీలుగా ముందస్తుగా ఈ క్యాలెండర్ విడుదల చేశాం. ఆయా పథకాలకు సంబంధించి ఎవరిపేరైనా లేకపోతే.. ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? ఎలా పరిశీలన చేయాలి? తదితర అన్ని వివరాలు అందరికీ తెలిసేలా ప్రదర్శించాలి.
నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు కచ్చితంగా అందాలి. సోషల్ ఆడిట్ తప్పనిసరిగా జరగాలి. గ్రామ, వార్డు సచివాలయాలు చూస్తున్న జేసీ ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి.
జూన్ 4న వాహన మిత్ర కార్యక్రమం ఎంతో దూరంలో లేదు. దీనికి సంబంధించి చేయాల్సిన పనులన్నీ వెంటనే చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ సేవలు ఏ సమయంలోగా అందుతాయో.. మనం కాల పరిధిని నిర్ణయించాం. ఆ టైమ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలి. ఈ వ్యవహారాల కోసమే ఒక జేసీని పెట్టాం. ఇవన్నీ తప్పనిసరిగా అమలయ్యేలా కలెక్టర్లు చూడాలి. సరైన ప్రొటోకాల్ పాటించాలి. పెన్షన్లు, బియ్యం కార్డుల మంజూరు.. కొత్తగా యాడ్ అయ్యేవారు ఉంటారు.. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ.
సాక్షి, అమరావతి: కోవిడ్–19 నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ నేపథ్యంలో పూర్తిగా దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు అన్ని వర్గాల ఆర్థిక ప్రగతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించారు. మేనిఫెస్టోలోని పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందజేసేందుకు తేదీల వారీగా ప్రకటించిన క్యాలెండర్‌ను జాగ్రత్తగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. తద్వారా ఆర్థిక రంగం పునరుద్ధరణ, పునరుత్తేజానికి దోహద పడాలని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులు, ప్రభుత్వ కార్యక్రమాల క్యాలెండర్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎకానమీని ఎలా పునరుద్ధరించాలి.. తిరిగి ఎలా పునరుత్తేజం తీసుకురావాలి.. అనే ఆలోచనతో ఈ క్యాలెండర్ తయారు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ క్యాలెండర్‌పై అధికార యంత్రాంగానికి దిశ నిర్ధేశం చేశారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన క్యాలెండర్ ఇలా..
► మే22న ఎంఎస్‌ఎంఈలకు : గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) మొత్తం రూ.905 కోట్లలో సగం చెల్లింపు. మిగిలిన సగం మొత్తం జూన్‌లో చెల్లింపు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు దాదాపు 10 లక్షల ఉద్యోగాలను ఇస్తున్నాయి. ఆ యూనిట్లు వాటి కాళ్ల మీద అవి నిలబడాలి. అందుకే కరెంటు ఫిక్స్‌డ్ చార్జీలు కూడా రద్దు చేస్తూ జీవో ఇచ్చాం. 3 నెలల పాటు ఆ చార్జీలు రద్దు అవుతాయి.
► మే 26న వన్‌టైం సహాయం: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు రూ.5 వేల చొప్పున వన్‌టైం సహాయం.
► మే 30న ఆర్‌బీకేలు ప్రారంభం: రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ప్రారంభం అవుతాయి. గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఇవి మారుస్తాయి. వీటి కోసం ఒక జాయింట్ కలెక్టర్‌ను కూడా పెట్టాం. గ్రామాల్లో ఆర్బీకేలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయి.
► జూన్ 4న వాహన మిత్ర : వైఎస్సార్ వాహన మిత్ర ఇస్తున్నాం. సొంత ఆటో, సొంత క్యాబ్ ఉన్న వారికి ఆ రోజు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తాం.
► జూన్ 10న పదివేల సాయం: నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు.. షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఏడాదికి ఒకసారి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మేరకు ఇస్తున్నాం.
► జూన్ 17న నేతన్న నేస్తం : మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.24 వేలు ఇస్తాం. ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ ఇదే తేదీన చెల్లిస్తాం. మాస్క్‌ల తయారీకి ఆప్కో నుంచి బట్ట తీసుకున్నాం. అందుకు సంబంధించిన డబ్బు కూడా వెంటనే చెల్లిస్తున్నాం.
► జూన్ 24న కాపు నేస్తం: వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. 45–60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి అక్కకూ తోడుగా ఉండేందుకు రూ.15 వేలు ఇస్తున్నాం.
► జూన్ 29న ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత: ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల.
► జూలై 1న కొత్త అంబులెన్స్‌లు : 104, 108 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం. మొత్తం 1,060 కొత్త వాహనాలు ప్రారంభం. ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
► జూలై 8న ఇళ్ల స్థలాలు: వైఎస్సార్ పుట్టిన రోజున అర్హులైన పేదలందరికీ 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ.
► జూలై 29న వడ్డీలేని రుణం: రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం.
► ఆగస్టు 3న విద్యాకానుక: జగనన్న విద్యా కానుక అమలు. ఈ పథకం కింద పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూలు, సాక్సులు ఇస్తాం.
► ఆగస్టు9న ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు: ఆదివాసీ దినోత్సవం నాడు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ. ఐటీడీఏలున్న కలెక్టర్లు అందరూ దీనిపై దృష్టి పెట్టాలి.
► ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత : ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు 45–60 ఏళ్ల మధ్య ఉన్నవారికి రూ.18,750 ఆ రోజు ఇస్తాం.
► ఆగస్టు 19న జగనన్న వసతి దీవెన కార్యక్రమం అమలు: ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకు భోజనం, వసతి ఖర్చుల కోసం తల్లులకు రూ.10 వేల చొప్పున మొదటి దఫా ఇస్తాం.
► ఆగస్టు 26న గృహ నిర్మాణం ప్రారంభం: 15 లక్షల వైఎస్సార్ గృహాల నిర్మాణం ప్రారంభం. ఎకానమీని ఇది ఓపెన్ చేస్తుంది.
► సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా అమలు: ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు దఫాల్లో డ్వాక్రా అక్క చెల్లెమ్మల చేతికిచ్చి, వారికి తోడుగా ఉంటామని చెప్పాం. ఇందులో భాగంగా మొదటి దఫా ఆసరాకు ఆ రోజు శ్రీకారం చుడతాం.
► సెప్టెంబర్ 25న విద్యాదీవెన: జగనన్న విద్యా దీవెన ప్రారంభం. కాలేజీలకు బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటికే ఇచ్చాం. ఆ రోజు ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు నేరుగా పిల్లల తల్లుల చేతికే ఇస్తాం.
► అక్టోబర్‌లో రైతు భరోసా రెండో విడత: వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత సాయం చేస్తాం. ప్రతి కుటుంబానికి రూ.4 వేల చొప్పున రైతులకు ఇస్తాం. పంట కోసుకునేందుకు లేదా రబీ అవసరాల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది. తేదీ తర్వాత ప్రకటిస్తాం.
► అక్టోబర్‌లో జగనన్న తోడు: హాకర్స్‌కు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తాం. చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇస్తాం. వారికి వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలు మంజూరు చేయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి మేలు జరుగుతుంది.
► నవంబర్‌లో విద్యా దీవెన: జగనన్న విద్యా దీవెన రెండో దఫా మొత్తం ఇస్తాం. పిల్లల ఫీజులు నేరుగా తల్లుల ఖాతాకు జమ చేస్తాం.
► డిసెంబర్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం: ఆ సమయానికి కలెక్టర్లు, ఎస్పీలు, సీఐడీ విభాగాలు.. కోర్టుల నుంచి అనుమతులు తీసుకోవాలి. జాబితాలను ఆమోదింప చేయించుకోవాలి.
► 2021 జనవరిలో అమ్మ ఒడి: రెండో ఏడాది ఈ కార్యక్రమం కింద పిల్లలను బడులకు పంపించే తల్లులకు 15 వేల రూపాయల చొప్పున చెల్లింపు.
► 2021 జనవరిలో వైఎస్సార్ రైతు భరోసా చివరి విడత: సంక్రాంతి నాటికి పంటను ఇంటికి తెచ్చుకునే సమయంలో రూ.2 వేలు చొప్పున ఇస్తాం.
► 2021 ఫిబ్రవరిలో: జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికానికి సంబంధించిన మొత్తం ఇస్తాం. అలాగే వసతి దీవెన కూడా రెండో దఫా ఇస్తాం.
► 2021 మార్చిలో: పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం.
Comments
Please login to add a commentAdd a comment