చెప్పుల్లేని కాళ్లు.. నడినెత్తిన సూరీడి నిప్పులు.. ఆ చంకన బిడ్డలు.. ఈ భుజాన బరువులు.. ఎంత నడిచినా తరగని దూరాన సొంతూళ్లు.. దేవుడిపైనే భారం వేసి.. ఆకలి దప్పులతో ముందుకు సాగుతున్న వలస కార్మికులకు ఆంధ్ర గడ్డపై భరోసా లభించింది. నడిచి వెళ్తున్న వలస కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని.. వారు ఎక్కడ తారసపడినా భోజనం, మంచినీరు అందించి.. బస్సుల్లో తరలించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యంత్రాంగం ముందుకు కదిలింది. వలస కూలీలకు ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాగం, దాతలు భోజన ఏర్పాట్లు చేశారు. మంచినీళ్లు, పండ్లు అందించారు. రిలీఫ్ క్యాంపులు నెలకొల్పి కూలీలు సేద తీరేందుకు చర్యలు తీసుకున్నారు. ఏపీలోకి వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరిపోయాయని వలస కూలీలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఏపీ మీదుగా వెళ్తున్న వీరికి మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చి రైళ్లు, బస్సుల ద్వారా తరలించేందుకు సర్కారు నడుం కట్టింది.
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రం మీదుగా సొంతూళ్లకు నడుచుకుంటూ వెళ్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను వారివారి స్వస్థలాలకు పంపించాలని.. వారికి భోజనం, ఇతరత్రా సదుపాయాల విషయంలో ఎలాంటి లోటు రానివ్వొద్దని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చులకు అస్సలు వెనకాడవద్దని.. ఎంత వ్యయం అయినా సరే వారిని బస్సుల్లో తరలించాలన్నారు. కాళ్లకు చెప్పుల్లేకుండా చంకన పిల్లలను ఎత్తుకుని, తల మీద బస్తాలను పెట్టుకుని వెళ్తున్న వలస కూలీల పరిస్థితిని చూసి సీఎం చలించిపోయారు. దీంతో రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు బస్సుల ద్వారా చేర్చాలని, అలాగే.. భోజన వసతి కల్పించాలని శనివారమే ఆదేశించిన వైఎస్ జగన్.. ఆదివారం ఉదయం వారికి అందిస్తున్న సదుపాయాలపై సీఎంఓ కార్యాలయ అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు.
► ఖర్చుల గురించి ఆలోచించకుండా ఉదారంగా, మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలన్నారు.
► ఇప్పుడు మానవత్వాన్ని చూపించాల్సిన సమయమనే విషయాన్ని మనం గుర్తించుకోవాలని సూచించారు.
మనలా ఎవరూ చేయడంలేదు
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటివరకు వలస కూలీలకు అందించిన సహాయ కార్యక్రమాలపై ఉన్నతాధికారులు సీఎం కి వివరించారు.
► ఏ రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వంలా చేయడంలేదని, సీఎం ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
► కాలినడకన ఒడిశా వెళ్తున్న 902 మందిని షెల్టర్లకు తరలించి అన్ని సదుపాయాలు అందించామన్నారు.
► వీరిని తిరిగి బస్సుల్లో ఒడిశాకు పంపించామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.
► ఈ విధంగా ఇప్పటివరకు ప్రకాశం జిల్లా నుంచి 10 బస్సుల్లో 470 మందిని.. కృష్ణాజిల్లా నుంచి 16 బస్సుల్లో 410 మందిని.. శ్రీకాకుళం నుంచి ఒక బస్సులో 22 మందిని పంపించామని అధికారులు వెల్లడించారు.
► ఆదివారం గుంటూరు నుంచి 450 మందిని, కృష్ణా జిల్లా నుంచి మరో 52 మంది వలస కూలీలను పంపిస్తున్నామన్నారు.
► నడుచుకుంటూ వెళ్లాల్సిన అవసరంలేదని వారికి చెబుతూనే భోజనం, ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్న విషయాన్ని కూలీలకు వివరిస్తున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment