కాలు దువ్వుతున్న కోళ్లు | cock fight in vizianagaram | Sakshi
Sakshi News home page

కాలు దువ్వుతున్న కోళ్లు

Published Thu, Jan 15 2015 3:52 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కాలు దువ్వుతున్న కోళ్లు - Sakshi

కాలు దువ్వుతున్న కోళ్లు

 పాండవ ప్రథముడు ధర్మరాజు..కౌరవులతో జూదమాడి ద్రౌపదిని పందెం ఒడ్డితే కురుక్షేత్రం జరిగింది. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ  సరదాగా ఆడిన కోడిపందాలు పంతానికి పోయి పల్నాటి యుద్ధానికి దారి తీశాయి. చరిత్ర ఎంత చెబుతున్నా పందెం..పందెం..పందెం.. ఈ పదం సామాన్యుల దగ్గర నుంచి కుబేరుల వరకు ఊతపదం అయిపోయింది. నేడు సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌ల మీద, రాజకీయ నాయకుల గెలుపోటముల మీద పందాలు కాయడం సర్వసాధారణమైపోయింది. ఇక పండగలు పబ్బాలు వచ్చాయంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కోడి పందాల హవా జోరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజల సంక్రాంతి పండగ రానే వచ్చేసింది. పండగ మూడు రోజులూ సుష్టుగా భోజనం చేయడం, కోడిపందాలు చూస్తూ.. బెట్టింగ్‌లకు దిగుతూ  ఆస్వాదించడం పరిపాటి. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లాలో కోడి పందాలకు రంగం సిద్ధమైపోయింది.  
 
 సాక్షి  ప్రతినిధి, విజయనగరం:జిల్లాలో కోడి పందాలకు పందెం రాయుళ్లు సై అంటున్నారు. ఇప్పటికే పందాల కోసం పలు చోట్ల భారీ ఏర్పాట్లు చేశారు. మరికొన్ని చోట్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పందెం కోళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి.  పోటీల కోసం  గత కొద్ది రోజులుగా కసరత్తులు చేయించిన కోళ్లు బరిలోకి దిగడానికి కాలు దువ్వుతున్నాయి. కోట్లలో పందాలు కాసేందుకు పందెగాళ్లు సన్నద్ధమవుతున్నారు.  కోడి పందాల నిషేధంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో పందెం రాయళ్లు ఇక బహిరంగంగా పందాలు నిర్వహించుకోవచ్చన్న ఆలోచనకొచ్చేశారు.ప్రతిసారీ సంక్రాంతి నేపథ్యంలో ఎన్ని ఆంక్షలున్నా, పోలీసులు దాడులు చేసినా పందాలు ఏమాత్రం తగ్గలేదు. పోలీసులకు తెలియకుండా కొన్నిచోట్ల, వారి కళ్లుగప్పి మరికొన్నిచోట్ల, ముడుపులు ముట్టజెప్పి ఇంకొన్నిచోట్ల పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో నిషేదం కాగితాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది.
 
 అయితే, ఈసారి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని, యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చన్న ఆలోచనతో  పందెం రాయళ్లు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎస్‌కోట, వేపాడ, లక్కవరపుకోట, జామి, కొత్తవలస, భోగాపురం, నెల్లిమర్ల, డెంకాడ, గుర్ల, బొబ్బిలి, సీతానగరం, బాడంగి, తెర్లాం, రామభద్రపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట, కురుపాం, జియ్యమ్మవలస, పార్వతీపురం తదితర  మండలాల్లో ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది.పోటీలకు వేదికలను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి రోజు నుంచి పోటీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.  
 
 ఇక పోటీల కోసం నెలల తరబడి పెట్టుబడి పెట్టి  మేపిన కోడి పంజుల్ని సిద్ధం చేశారు. కంటికి రెప్పలా వాటిని చూసుకుంటు న్నారు.  సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలో పలుచోట్ల జరిగిన సంతల్లో పందెం కోళ్ల విక్రయాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి.  పందాల కోసం తయారు చేసిన నెమలి, కాకి, పర్ల, సేతవా, కొక్కిరాయి, రసంగి, అబ్బరాజ్, పూల డేగ, థెరిసా, జింగ్లీ వంటి జాతి కోళ్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. వాటి సామర్థ్యం ప్రకారం పోటీకి పెట్టేందుకు పందెగాళ్లు  ఉత్సుకతతో ఉన్నారు. పెద్ద ఎత్తున బెట్టింగ్ కాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి రూ.కోట్లలోనే పందెం జరగొచ్చని తెలుస్తోంది.
 
   సుప్రీంకోర్టు తీర్పును తమకు అనుకూల తీర్పుగా నిర్వాహకులు భావిస్తుంటే, కోడి పందాలు నిర్వహించుకోవచ్చని ఎక్కడా చెప్పలేదన్న వాదనతో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. జిల్లాలో అనుమానిత ప్రాంతాలపై  ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికార పార్టీ నేతలతో ఒత్తిడి చేయిస్తుండడమే కాకుండా, ముడుపులు ముట్టజెప్పేందుకు పందాల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ఒత్తిళ్లు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఏదేమైనప్పటికీ పల్లెల్లో సంక్రాంతి సందడితో పాటు కోడి పందాల హడావుడి  ఎక్కువగా  కన్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement