కోళ్లకు విషాదం.. కోట్లలో జూదం
అమలాపురం :కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నామన్న భయం లేదు. పోలీసులు హెచ్చరిస్తున్నారన్న వెరపు లేదు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో కోడి పందేలు నిర్వహించి తీరతామన్న వారు చివరకు అనుకున్నది సాధించారు. జిల్లాలో సంకారంతి పండుగ లో తొలిరోజైన బుధవారం యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహించారు. ‘సంప్రదాయాన్ని గౌరవిస్తామనే’ రాజకీయ నాయకుల మాట బాగా నిర్వాహకులకు వంట బట్టినట్టుంది.. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పందేలు ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా మరిన్ని గ్రామాలకు విస్తరించాయి.జిల్లా అంతటా వందల చోట్ల నిర్వహించిన బరుల్లో కోడితలలు తెగిపడ్డాయి. పచ్చనోట్ల కట్టలు పెళ్లపెళలాడాయి. క్షణాల్లో లక్షల సొమ్ము చేతులు మారింది. తొలిరోజు జిల్లావ్యాప్తంగా ఇలా చేతులు మారిన మొత్తం రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. జిల్లాలో డెల్టా, మెట్ట, ఏజెన్సీ అనే తేడా లేదు, ఎక్కడ చూసినా పందేల సందడే.
పందేలు జరిగే ప్రాంతాల్లో తిరణాళ్లను తలపిస్తున్నట్టు జనమే జనం. పందేల నిర్వహణకు కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉండడంతో అడ్డుకుని తీరుతామని పోలీసులు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా పందేలు నిర్వహించే గ్రామాల్లో రాత్రంతా కాపలా కాసినా నిర్వాహకులు లెక్క చేయలేదు. ‘పచ్చ’ నాయకులపై నమ్మకంతో ఏర్పాట్లు యథావిధిగా కొనసాగించారు. అయితే ఉదయం పోలీసులు పందేలకు అంగీకరించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. పందేల నిర్వాహకుల్లో అలజడి నెలకొంది. హైదరాబాద్ స్థాయి నుంచి ఒత్తిళ్లు రావడంతో అడ్డుకుని తీరతామన్న పోలీసులు పందేలు జరిగే ప్రాంతాలను వదిలి పోలీసు స్టేషన్లకే పరిమితమయ్యారు. ఉదయం పందేలు జరగకపోవడంతో మధ్యాహ్నం నుంచి బరులు పెంచి మరీ పందేలు నిర్వహించారు.
కోనసీమలో పట్టపగ్గాల్లేని పందేలు
కోనసీమలో పందేలు పట్టపగ్గాల్లేకుండా సాగాయి. అల్లవరం మం డలం గోడిలంకలో పందాలు జోరు గా సాగాయి. ఇక్కడ పందేలకు తొలుత రెండు బరులు ఏర్పాటు చేసి చేసినా ఉదయం జరగలేదనే వంకతో కొత్తగా మూడు బరులు వేసి, మొత్తం ఐదు చోట్ల పందేలు నిర్వహించారు. దీనితోపాటు ఇక్కడ 14 బోర్డులు పెట్టి గుండాటను, ఇతర జూదాలను యథేచ్ఛగా నిర్వహించారు.
అక్కడ గుండాటలో కనీస పందెం రూ.500
గోడిలంకలో గుండాటలో రూ.500 తక్కువ కాయడానికి అంగీకరించలేదు. ఒక్కసారి ఆటకు రూ.ఐదు వేల వరకు పందెం కట్టడం గమనార్హం. కోడి పందేలు జరిగిన అనేకచోట్ల గుండాటలు, ఇతర జూదాలు ముమ్మరంగా జరిగాయి. ఐ.పోలవరం మండలం ఎదుర్లంకలో పందేలను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆరంభించారు. ఇదే మండలం కేశనకుర్రులో పందేలు కోటి దాటినట్టు అంచనా. మలికిపురం మండలం మలికిపురం, గుడిమెళ్లంకలో పందేలు ముమ్మరంగా జరిగాయి. మామిడికుదురు మండలం మగటపల్లిలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అనుచరుల కనుసన్నల్లో పందేలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో తొలి రోజు పందెం రూ.కోటికి పైగా ఉండగా, రెండవ రోజు రూ.రెండు కోట్ల వరకు జరిగే అవకాశముందని అంచనా. ఇదే మండలంలో మేడపాడులో కూడా పందేలు జోరుగా సాగాయి. మెట్టలో రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో తొలి రోజున రూ.75 లక్షల వరకు పందేలు కాశారు. పిఠాపురం వై ఎస్సార్ గార్డెన్స్‌లో పందేలను ఎమ్మె ల్యే ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ ప్రారంభిం చారు. దివాన్‌చెరువు నుంచి పా లచర్ల వెళ్లే దారిలో, కానవరం, తోకా డ, కల్వచర్ల, కిర్లంపూడి, వేళంకలో పందేలు జరిగాయి. రంపచోడవరం, తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి రూరల్, మండపేట, కాకినాడ రూరల్, రామచంద్రపురం నియోజకవర్గాల్లో సైతం పందేలు యథేచ్ఛగా సాగాయి.
పందేలకు వ్యతిరేకంగా మగటపల్లిలో దీక్ష
పందేల నిర్వహణకు వ్యతిరేకంగా మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన ముగ్గురు నిరాహారదీక్షకు దిగారు. సీనియర్ నాయకుడు బొలిశెట్టి భగవాన్‌తోపాటు మరో ఇద్దరు దీక్ష చేపట్టారు. పోలీసులు తక్షణం స్పందించి పందేలను అడ్డుకునేవరకూ దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. పందేలను అడ్డుకుంటామని డీ ఎస్పీ ఎల్.అంకయ్య హామీ ఇవ్వడంతో విరమించారు.