టీడీపీ ప్రభుత్వం చెబుతున్నదొకటి... చేస్తున్నదొకటి... ఇసుక రీచ్‌ల వ్యవహారం చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. పొదుపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇసుక రీచ్‌లు వారికి కేటాయించామని సీఎం ఘనంగా ప్రకటనలిచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్లుగా ఉంది. రీచ్‌ల వద్ద పొదుపుసభ్యుల కష్టపడుతోంటే ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వెళ్తోంది.
సైదాపురం: మండలంలోని తూర్పుపూండ్ల గ్రామ సమీపంలో ఉన్న కైవల్యానది రీచ్‌లో ఎనిమిది నెలల కాలంలో సుమారు 16,816 క్యూబిక్ మీటర్లు ఇసుకను తవ్వి విక్రయించారు. ఒక క్యూబిక్ మీటరు రూ.600 వంతున 16,816 క్యూబిక్ మీటర్లకు రూ.కోటి 60వేల వరకు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. రీచ్ వద్ద పనిచేసే కంప్యూటరు అపరేటర్‌కు నెలకు రూ.4,500, అకౌంటెంట్‌కు రూ.4,500, రీచ్ ఇన్‌చార్జ్‌కు రూ.4,500 ఇవ్వాలని నిర్ణయించారు. ఎనిమిది నెలలకు ప్రభుత్వం ముగ్గురు ఉద్యోగులకు రూ.1.8లక్షలు ఇచ్చారు. అయితే రీచ్‌లు పర్యవేక్షణ చేసిన పొదుపు మహిళలకు రోజుకు కేవలం రూ.100 ఇచ్చారు. ఇలా ఎనిమిది నెలలకు వీరికి ప్రభుత్వం రూ.96 వేల అందించింది.
వెట్టిచాకిరే...
తూర్పుపూండ్లలో 45 పొదుపు సంఘాలున్నాయి. వాటిలోని 12 మంది సభ్యులను మాత్రమే ఇసుక రీచ్‌ను పర్యవే క్షణ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది .ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉన్నందుకు వారికి దక్కింది కేవలం రూ.100. బయట పనులకు వెళ్తే వారికి రూ.300 వస్తోంది. ఇలా మహిళల చేత ప్రభుత్వం వెట్టిచాకి రి చేయించుకుంది.
దక్కింది రూ.56 మాత్రమే..
రీచ్ ప్రారంభమయ్యాక ఇన్సెంటివ్ పేరుతో రూ.50,350ను ప్రభుత్వం విడుదల చేసింది. వాటిలో నిర్వహణకు రూ. 25 వేలు వెచ్చించారు. మిగిలిన రూ.25,350ను పొదుపు సంఘాల మహిళలు పంచుకోవాలని చెప్పారు. గ్రామంలోని 45 పొదుపు సంఘాల్లో సుమారు 450 మంది సభ్యులున్నారు. ఆ డబ్బును వాళ్లు పంచుకోగా ఒక్కొక్కరికీ రూ.56 మాత్రమే వచ్చింది. ఇసుక రీచ్ వల్ల ప్రభుత్వానికి రూ. ఒక కోటి 60 వేలు వచ్చింది. సుమారు రూ.10,12,350లను ఖర్చుచేశారు. మిగిలిన రూ.89,87,650లు ప్రభుత్వ ఖజానాకు జమైంది. రీచ్‌ల ద్వారా పొదుపు మహిళలకు ఎంతో చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం రూ. 56 మాత్రమే ఇస్తుండటంతో సదరు మహిళలు విస్తుపోతున్నారు.
వంద రూపాయలే ఇస్తున్నారు:
ఇసుకరీచ్ వద్ద పనిచేస్తున్నాం. రోజుకు వంద రూపాయల వంతున నెలకు ఒక్కసారి ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాం. ఊళ్లో పని కావడంతో ఆపనికి వెళ్లుతున్నాం.-ముత్తూకూరు వెంకటరత్నమ్మ
కష్టం ఎక్కువ.. వచ్చేది తక్కువ
ఇసుక రీచ్ వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటున్నాం. మాకు వందరూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదనంగా మరో వందరూపాయలు ఇస్తే చాలు. అన్ని పనులు చూసుకుంటాం.-తక్కెళ్ల అంకమ్మ
రీచ్‌ల్లో చెల్లెమ్మల వాటా చిల్లరే!
Published Sun, Jul 5 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement