కాలే కడుపుకు కుళ్లిన వంట | Cole stomach decomposing Cooking | Sakshi
Sakshi News home page

కాలే కడుపుకు కుళ్లిన వంట

Oct 3 2014 1:29 AM | Updated on Jun 4 2019 5:04 PM

కాలే కడుపుకు కుళ్లిన వంట - Sakshi

కాలే కడుపుకు కుళ్లిన వంట

ప్రజాప్రతినిధుల పట్టించుకోనితనం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వెరచి ప్రభుత్వాసుపత్రుల్లోని రోగుల కడుపు అర్థాకలితో మలమల మాడిపోతుంది.

ఈడేపల్లి : ప్రజాప్రతినిధుల పట్టించుకోనితనం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం వెరచి ప్రభుత్వాసుపత్రుల్లోని రోగుల కడుపు అర్థాకలితో మలమల మాడిపోతుంది. అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో కాంట్రాక్టర్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ‘ప్రత్యేక మెనూ’ అనే పదాన్నే మరచిపోయాడు. నిబంధనల మేరకు రోగులకు ప్రత్యేక మెనూ ప్రవేశపెట్టినా అది కాగితాలకే పరిమితమైంది తప్ప పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు రోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. పెట్టే భోజనం  అరకొరగా అధ్వాన్నంగా ఉండడంతో అన్నమో ‘రామచంద్రా ’ అని రోగులు ఆకలితో అల్లాడిపోతున్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిలో నెలకొన్న దుస్థితి ఇదీ.
 
కుళ్లిపోయిన కూరగాయలే దిక్కు...

నాణ్యమైన కూరగాయలతో రోగులకు భోజనం పెట్టాలని నిబంధనలు చెబుతున్నా వీటిని తుంగలోకి తొక్కి నాసిరకం కూరలతో భోజనం తయారు చేస్తున్నారు. ఇక్కడి భోజనశాలలోని కూరగాయల్ని చూస్తే... మళ్లీ జన్మలో ఆ ఛాయలకు వెళ్లరు. రైతుబజారులో ఎవరూ కొనకుండా వదిలేసిన, జంతువులకు ఆహారంగా ఉపయోగించే కుళ్లిపోయిన కూర గాయల్ని తెచ్చి రోగులకు ఆహారంగా వండుతున్నారు. వీరికి ఇచ్చే పాలు పూర్తిగా నీళ్ల పాలు. భోజనశాల కాంట్రాక్టరు  తన వ్యాపారంలో భాగంగా స్థానిక హోటల్స్‌కు  పాలు సరఫరా చేస్తుంటాడు. ఇలా హోటల్స్‌లో సాయంత్రం పూట మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తక్కువ ధరకు కొనడం లేదా సేకరించి దీన్ని మర్నాడు ఉదయం రోగులకు పెట్టే అల్పాహారానికి ఉపయోగిస్తుంటాడని విశ్వసనీయ సమాచారం. రైతుబజారులో నిల్వఉన్న, పాడై పోయిన కూరగాయలను సదరు కాంట్రాక్టరు తక్కువ రకానికి కొనుగోలు చేస్తుంటాడు. కుళ్లివాసన వస్తున్న టమాటలను కూడా సేకరించి తీసుకువెళ్తుంటాడని రైతు బజారు వర్గాలు చెబుతున్నాయి.
 
20ఏళ్ల నుంచి ఒకే కాంట్రాక్టరు....
 
దాదాపు 20ఏళ్ల పైనుంచి ఒకే కాంట్రాక్టరు  చేతిలో భోజనశాల(మెస్) నడుస్తోందని ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. ఈ కాంట్రాక్టరుకు అటు ఆస్పత్రి వర్గాలు, ఇటు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఆ వర్గం నాయకులను తన బుట్టలో వేసుకోవడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య అని ఆస్పత్రి సిబ్బందే బాహాటంగా చెబుతున్నారు.
 
నిబంధనలకు తిలోదకాలు ...  
 
సాధారణ, ఆరోగ్యశ్రీ, జననీ సురక్షాయోజన పథకం  రోగులకు అల్పాహారం, పాలు, మజ్జిగ, సన్నబియ్యంతో వండిన అన్నం, నాణ్యమైన కూరగాయలతో తయారు చేసిన కూర, అరటి పండు, గుడ్డు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. కానీ అమలులో మాత్రం అలసత్వమే కనపడుతోంది.  రోగులకు ఇచ్చే అర టి పళ్లు కళ్లిపోయి కంపుకొడుతుంటాయి.  
 
అందరికీ ఒకేలా..

ప్రభుత్వాసుపత్రిలోని సాధారణ, ఆరోగ్యశ్రీ,  జననీసురక్షాయోజన(జేఎస్‌ఎస్‌కే) రోగులకు వేర్వేరుగా మెనూ ఉంది . కానీ అందరికీ సాధారణ రోగుల మాదిరిగానే ఒకేలా భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారు. సాధారణ పేషింట్‌లకు రూ. 56 విలువ గల భోజనం, ఆరోగ్యశ్రీ వారికి రూ. 60 , జననీసురక్షా రోగులకు రూ. 60  ఖరీదు గల ఆహారం పెట్టాలి. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా ప్రతిరోజూ రెండు గుడ్లు, వారంలో ఒకసారి మాంసాహార భోజనం అందివ్వాలి. కానీ ‘వండిందే తిను, పెట్టిందే మెనూ’  అన్న రీతిలో కాంట్రాక్టరు తీరు ఉంటోందని రోగులు కన్నీరుమున్నీరవుతున్నారు.  
 
పర్యవేక్షణ లోపమే శాపమా?

రోగుల భోజనానికి ఉపయోగించే కూరగాయల నాణ్యత పరిశీలనకు ప్రత్యేకంగా డైటీషియన్ ఉండాలి. వారి సమక్షంలోనే ఆహారపదార్ధాలు వండి రోగులకు పెట్టాలి. కానీ గత ఆరేళ్ల నుంచి  డైటీషియన్ పోస్టు ఖాళీగానే ఉంది. భోజనం వడ్డించే ముందుగానే డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో ఆహార పదార్ధాల నాణ్యత పరిశీలించి, రుచి చూసిన తర్వాత మాత్రమే రోగులకు పెట్టాలనేది నిబంధన. కానీ పర్యవేక్షించాల్సిన అధికారులు కేవలం రికార్డుల్లోనే వీటిని నమోదు చేసుకుని చేతులు కడుక్కుంటున్నారనే ఆరోపణలున్నాయి.
 
చర్యలు తీసుకుంటాం
 భోజనం మెనూ ప్రకారమే అమలవుతోంది. దీనిపై ఇంతవరకూ ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. డైటీషియన్ లేకపోవడంతో నర్సింగ్ సూపరింటెండెంట్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాం. వారు ప్రతిరోజూ ఆహారపదార్థాల నాణ్యతని పరిశీలిస్తున్నారు. ఒక వేళ నాణ్యతా లోపాలేమన్నా ఉన్నట్లు నాదృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
 - డాక్టరు ఎమ్.జయకుమార్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement