కలెక్టర్ సత్యనారాయణ
కరువుకు నిలయం అనంత. ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంతే. అందుకే బడుగుబలహీన వర్గాల పిల్లలకు సంక్షేమ హాస్టళ్లే దిక్కు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం.. వసతుల లేమి విద్యార్థులకు ప్రత్యక్ష నరకంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆ మేరకు తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమించారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. అక్కడే రాత్రి బస చేస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంపై కన్నెర్ర చేస్తూ.. మెరుగైన వసతి సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు.
సాక్షి, అనంతపురం : విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, దివ్యాంగ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అకస్మిక తనిఖీలు చేస్తూ దడ పుట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల హాజరు, భోజనం నాణ్యత, మెనూ అమలు.. హాస్టల్ వార్డెన్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్
హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్న కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఐదుగురు వార్డెన్లపై ఇప్పటికే వేటు వేశారు. అయినప్పటికీ మిగతా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సస్పెండ్ చేయడం.. కొద్దిరోజుల తర్వాత దాన్ని ఎత్తివేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన కలెక్టర్ కొత్త పంథా ఎంచుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా ఇంక్రిమెంట్ల కోతకు చర్యలు తీసుకుంటున్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చిన తర్వాత(విత్/వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్) ఒకటి లేక రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ ఏఎస్‌డబ్ల్యూఓ ప్రసాద్, చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ మారుతీరావు, కుక్ నారాయణమ్మ, బీకేఎస్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూడేరు బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ కేఆర్ శశికళకు చార్జెస్ ఫ్రేం చేశారు.
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
⇔ చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్‌ను ఈనెల 7న కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. 55 మంది పిల్లలకు గాను 26 మంది మాత్రమే ఉన్నారు. 29 మంది గైర్హాజరయ్యారు. వినాయక చవితి పండుగకు వెళ్లిన వారు ఇంకా రాలేదని వార్డెన్ ఇచ్చిన సమాధానంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ 3వ తేదీ అయితే 7వ తేదీ వరకు రాకపోయినా మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా పప్పులో ఉప్పు ఎక్కువైందనీ, సాంబారులో నీళ్లు తప్ప కూరగాయలు కనిపించలేదని.. పైగా పప్పులో రాళ్లు కనిపించాయన్నారు. తనకు వడ్డించిన అన్నంలోనే రాయి వచ్చిందన్నారు. మెనూ ప్రకారం వెజిటబుల్ కర్రీ చేయాల్సి ఉన్నా..నీళ్ల చారుతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
⇔ ఇక ఈనెల 3న కలెక్టర్ బుక్కరాయసముద్రంలో ఎస్సీ హాస్టల్‌ను పరిశీలించారు. 130 మందికి గాను కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎస్టీ హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన కలెక్టర్ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ పనితీరు మార్చుకుని ప్రభుత్వ ప్రాధాన్యామాలకు అనుగుణంగా పనిచేయాలని లేకపోతే ఇంటికి పంపించేందుకు కూడా వెనకాడేది లేదని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు.
సస్పెన్షన్ వేటు పడిన వార్డెన్లు
►రామునాయక్, అనంతపురం ఎస్సీ నంబర్–4 హాస్టల్ వార్డెన్
►బాబు, బుక్కరాయసముద్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్
►వెంకటేశ్వర్లు, ఎస్టీ హాస్టల్ వార్డెన్
►ఠాగూర్, గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు బీసీ హాస్టల్ వార్డెన్ (వీరిలో రామునాయక్, ఠాగూర్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు.)
Comments
Please login to add a commentAdd a comment