
అంతా ఆయనే!
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఓ మూలన ఉండే విభాగానికి ఆయన ఉన్నతాధికారి. ఆయనకు ఇది సొంత శాఖ కూడా కాదు.
కలెక్టరేటు
► ఏ ఫైల్ అయినా ఆయన చూడాల్సిందే
► ఏ నియామకానికైనా చేయి తడపాల్సిందే
► జిల్లా కేంద్రంలో ఓ అధికారి పెత్తనం
ప్రాపకం ఉంటే ఏం చేసినా.. ఎంత తిన్నా చెల్లుబాటు అవుతుందనడానికి కలెక్టరేట్ వేదికవుతోంది. నియామకాలు, బదిలీల్లో ఓ అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. స్వయంగా ఓ ఉన్నతాధికారే ఆయనకు పెత్తనం కట్టబెట్టడంతో ఫిర్యాదు చేసేందుకు సైతం ఉద్యోగులు జంకుతున్నారు. - సాక్షి, కర్నూలు
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఓ మూలన ఉండే విభాగానికి ఆయన ఉన్నతాధికారి. ఆయనకు ఇది సొంత శాఖ కూడా కాదు. డిప్యూటేషన్‌పై నియామకం. అయినా ఈయన చెప్పిందే కలెక్టరేట్‌లో వేదం. ఇతర శాఖలకు చెందిన కీలక ఫైళ్లు సైతం ఈయన పరిశీలించాకే జిల్లా సర్వోన్నతాధికారికి వెళ్తున్నాయి. బదిలీలు, పోస్టింగ్‌లు,
కారుణ్య నియామకాలు ఏవైనా సరే ఆయనకు నజరానాలు ముడితేనే పని. జిల్లాస్థాయి అధికారులకు వెళ్లే రికార్డుల్లో ఏవైనా తప్పులుంటే కామెంట్ రాసి వాటిని కిందకు పంపుతారు. ఈ అంశాన్నే వసూల్ రాజా నగదుగా మలచుకుంటున్నాడు. రికార్‌డ్స లోపాలున్నాయని.. తనను సంతృప్తి పరిస్తే పనులు జరుగుతాయని డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఏ నియామకానికైనా చేయి తడపాల్సిందే.. రెవెన్యూ ఇన్‌స్పెక్టరు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆపై పోస్టులకూ.. ఏ నియమాకాలకైనా చేయి తడపాల్సిందే. జిల్లాలో ఏ విభాగంలో నియామకాలు చేపట్టాలన్నా ఆయా విభాగాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో పాటు ఇతరులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆయా శాఖలపై ఎలాంటి పట్టులేకపోయినప్పటికీ ఈయనను మాత్రం ప్రతి కమిటీకి కన్వీనర్‌గానో, సభ్యునిగానో నియమిస్తుండటం గమనార్హం. ఇటీవల అంగన్‌వాడీ, సర్వశిక్షా అభియాన్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విభాగాల్లో జరిగిన నియామకాల్లోనూ వసూల్ రాజా చక్రం తిప్పాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50 వేల నుంచి లక్షకుపైగా వసూలు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
జిల్లాస్థాయి అధికారులైనా ఆయన్ను కలవాల్సిందే..
జిల్లాస్థాయి అధికారులు సైతం ఆయనతో మాట్లాడాల్సిందే. వారి శాఖలకు సంబంధించిన ఏవైనా ఫైళ్లు ముందుకు కదలాలంటే ఆయన కరుణ తప్పదు. ఏ పని చేయించుకోవాలన్నా.. ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. బదిలీ, పోస్టింగ్, ఇతర ఏదైనా రికార్డు తయారైన తర్వాత సంబంధిత విభాగాల నుంచి ఉన్నతాధికారులకు వెళ్లాలి. కానీ, అలా జరగడం లేదు. కీలక శాఖలకు చెందిన ఫైళ్లన్నీ ఆయన పరిశీలించాకే సర్వోన్నతాధికారి వద్దకు చేరుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఉద్యోగులను పీడించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నా ఈ అధికారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.