ఆరోగ్యశ్రీ కోసం పోరుపథం
మహానేత ఆశయానికి ‘దేశం’ సర్కారు తూట్లు
ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న విధానాలు
యథాతథంగా అమలుకు వైఎస్సార్ సీపీ డిమాండ్
జగన్ పిలుపు మేరకు నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా
విజయవంతం చేయాలని కన్నబాబు పిలుపు
కాకినాడ : పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే మహోన్నత లక్ష్యంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని క్రమేపీ నిర్వీర్యం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నాటి పథకాన్ని యథాతథంగా అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు కాకినాడలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరపనుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రజలకు అవసరమైన అంశాలను తొలగిస్తున్న ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ మెరుగైన వైద్యసేవ అందుకోలేక ప్రాణాలు కోల్పోరాదన్న మహానేత వైఎస్ సంకల్పాన్ని ఉద్దేశ్యపూర్వకంగా నీరుగారుస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంతోపాటు వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజెప్పాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిపించేలా ఉద్యమాన్ని దశలవారీగా తీవ్రతరం చేయాలని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సంకల్పించారు.
ధర్నా వేదికగా సర్కారును ఎండగడదాం : కన్నబాబు
ఆరోగ్యశ్రీ పథకాన్ని యథాతథగా అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. జిల్లాలోని పార్టీ సీజీసీ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్‌లు, రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతోపాటు జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. పథకం ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్ విధానాలను ధర్నా వేదికగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.