మద్యం షాపులపై కలెక్టరేట్ వద్ద ఆందోళనలు
మద్యం షాపులపై కలెక్టరేట్ వద్ద ఆందోళనలు
Published Mon, Jul 10 2017 11:31 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
కాకినాడ సిటీ: జిల్లాలో ఇష్టానుసారం ఇళ్ళ మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తుండడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు సోమవారం కలెక్టరేట్‌కు చేరుకొని మద్యంషాపులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు వినతులు అందజేశారు. ప్రత్తిపాడులోని శివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మద్యం షాపును వేరే ప్రాంతానికి తక్షణం మార్చాలని శివాలయంవీధి ప్రజలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ వీధిలో శివాలయం, కనకదుర్గగుడి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది బస్‌కాంప్లెక్స్‌కు వెళ్లే దారి అని, దాంతో ఇది నిత్యం రద్దీగా ఉంటుందని, అలాంటి చోట మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం రేపాక గార్డెన్స్ ప్రాంతవాసులు తమ కాలనీలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపునకు అనుమతి రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. 28 ఏళ్లుగా వంద కుటుంబాలు జీవిస్తున్న తమ కాలనీలో మద్యందుకాణం ఏర్పాటు చేస్తే ప్రశాంతతకు భంగం వాటిల్లుతుందని రేపాక గార్డెన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ పరిధిలోని జయప్రకాశ్‌నగర్ క్రిస్టియన్ సమాధుల పక్కన మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని ఆ పరిసర ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇక్కడ మద్యం షాపునకు 25 మీటర్ల సమీపంలోనే ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాల, ఎంఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, మరోప్రక్క జయప్రకాశ్‌నగర్, రాజుల తూరంగా వాసులందరూ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్న ప్రాంతం నుంచే రాక పోకలు సాగించాల్సి ఉందని పేర్కొన్నారు. వారందరూ ఇక్కఽడ మద్యం షాపుతో తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాకినాడ అర్బన్ పరిధిలోని జగన్నాథపురం జె.రామారావుపేట సెంటర్‌లో మసీదు సమీపంలో మద్యం షాపు ఏర్పాటుపై మక్కా మసీద్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టి తక్షణం అక్కడి నుంచి ఆ షాపును వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement