తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఓ కార్పొరేట్ కాలేజీ నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి రేవతి(16) అనే విద్యార్థిని శుక్రవారం మృతిచెందింది. రేవతి ప్రస్తుతం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం పులిచర్ల మండలం బాలిరెడ్డిగారిపల్లె. అయితే కాలేజీ పై నుండి పడినప్పుడు ఆమె కొనఊపిరితో ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తనువు చాలించింది. ఈ విషయం తెలిసిన రేవతి తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, లక్ష్మీదేవి కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉమెన్స్ కాలేజీలో ఫిజిక్స్ పరీక్ష రాసి మధ్యాహ్నం తను చదువుతున్న కాలేజీకి వచ్చింది. ఇంతలోనే నాలుగో అంతస్తు మీద నుంచి కింద పడింది. రేవతి ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తూ కింద పడిందా అనే విషయం తెలాల్సి ఉంది. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా... కాలేజీ యాజమాన్యం వేధింపులే తమ బిడ్డ మృతికి కారణమని రేవతి తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని, మృతికి కారకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో వివాదం ముదిరిపోతోంది.